Telangana Cabinet Meeting: కొత్త సచివాలయం ప్రారంభమయ్యాక తొలిసారి తెలంగాణ కేబినెట్ భేటీ జరుగుతుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి మంత్రులతోపాటు అధికారులు పాల్గొననున్నారు. మంత్రి వర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంటారని టాక్. గవర్నర్ కోట ఎమ్మెల్సీ, అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, గవర్నర్ తిరస్కరించిన బిల్లులు, పోడు భూముల పట్టాల పంపిణీ, దశాబ్ధి వేడుకల నిర్వహణపై చర్చించే అవకాశం లేకపోలేదు. వీటితోపాటు అనేక అంశాలు కేబినెట్ భేటీలో ప్రస్తావనకు వస్తాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం 3గంటలకు కేసీఆర్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది.
అలాగే ఇవాళ్టి కేబినెట్ భేటీలో రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక రిజల్ట్, ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శంకుస్థాపనలు, పూర్తయిన ప్రారంభోత్సవాలు, కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేస్తారని తెలుస్తుంది. ఈ అంశాలపై సీఎం కేసీఆర్ మంత్రులకు దిశా నిర్దేశం చేస్తారని టాక్.
ఆవిర్భావ దినోత్సవ వేడుకలు 21 రోజులపాటు ఘనంగా నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కూడా మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తారని తెలుస్తుంది. అంతేకాకుండా అమరవీరుల స్మృతి వనం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఏదో ఒక రోజు ప్రారంభించే అంశంపై తేదీని ఖరారుపై చర్చకు వచ్చే వీలుంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీపై కూడా నిర్ణయం తీసుకోనున్నారు. ఇప్పటికే పలువురు పేర్లను ఫైనలైజ్ చేసిన సీఎం కేసీఆర్.. కేబినెట్ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..