అయ్.. పాయె .!, తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయమని స్పీకర్ కు లేఖ
Telangana TDP merge in TRS అయ్ పాయ్.!, చరమాంకానికి చేరిపాయ్.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ లా నిలిచిన తెలంగాణ..
Telangana TDLP merge in TRS అయ్.. పాయె.!, చరమాంకానికి చేరిపాయ్.. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీకి వెన్నుముఖ లా నిలిచిన తెలంగాణ ప్రాంతంలో టీడీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకొని టీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిన నాటి నుంచి ఆపార్టీ జీవకళ కోల్పోతూ వస్తోంది. ఇక, ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం టీడీపీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోయింది. తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోయే పరిస్థితికి వచ్చేసింది. సోదిలో లేకుండా పోయే పరిస్థితి దాదాపు దాపురించింది.
ఇప్పటికే తొంభైశాతం తెలంగాణ టీడీపీ నేతలంతా టీఆర్ఎస్ గూటికి చేరిపోగా, చివరి పరిణామమన్నట్టు తాజాగా అశ్వరావుపేట టీడీపీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్రావు, మరో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సంచలన నిర్ణయం తీసుకుని ఆదిశగా ప్రయాణం మొదలు పెట్టి గంట వ్యవధిలోనే ముగించారు. టీడీపీఎల్పీని టీఆర్ఎస్ పార్టీలోకి విలీనం చేయడానికి స్పీకర్ ఇంటికి బయలుదేరిన వీళ్లు.. ఈ సాయంత్రం వేళ తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డిని కలిశారు. తమ లెజిస్లేచర్ పార్టీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్టు స్పీకర్ కు లేఖ ఇచ్చారు.
కాగా, టీడీపీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎప్పుడో టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చారు. ఎవరూ ఊహించని విధంగా అశ్వాపురం ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సైతం ఇప్పుడు కారెక్కారు. వీరిద్దరూ టీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ వెంటనే టీడీపీ శాసనసభా పక్షాన్ని టీఆర్ఎస్ లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపై స్పీకర్ పోచారాన్ని కలిసి లేఖను అందించారు. ఇకపై తమను TRS ఎమ్మెల్యేలుగానే గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. అటు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంతరెడ్డితోనూ భేటీ అయ్యారు మెచ్చా నాగేశ్వరరావు. ఎప్పటి నుంచో మెచ్చా టీఆర్‌ఎస్‌లో చేరతారని ప్రచారం జరిగినా ఆయన ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు ఎలాంటి ప్రచారం లేకుండానే కారుకు జైకొట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరానని మెచ్చా నాగేశ్వరరావు ఈ సందర్భంగా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు.