హైదరాబాద్, మార్చి 7: వేసవి ప్రారంభంలోనే భానుడి ప్రతాపం హడలెత్తిస్తోంది. వేడి వాతావరణం కారణంగా ఇటీవల కాలంలో వాహనాల్లో మంటలు చెలరేగి ఒక్కసారిగా మంటలు అంటుకుని కాలిబూడిదై పోతున్నాయి. రోడ్డుపై ప్రయాణిస్తుండగానే పలుచోట్ల కారుల్లో మంటలు వ్యాపించి ప్రమాదాలు చోటు చేసుకుంటున్న కథనాలు నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా అటువంటి మరో సంఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటు చేసుకుంది. రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేడంతో కారు పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామ శివారులో గురువారం (మార్చి 7) చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిజామాబాద్ జిల్లాకు చెందిన భక్తులు వేములవాడ రాజన్న దర్శనానికి గురువారం (మార్చి 7) బయల్దేరారు. ఈ క్రమంలో పోసానిపేట శివారులోకి రాగానే ఒక్కసారిగా వారు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కారులో నుంచి దిగిపోయి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. తృటిలో తప్పించుకోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. గడచిన వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వై జంక్షన్ వద్ద కారులో మంటలు చెలరేగిన సంగతి తెలిసిందే. గుంటూరు నుంచి విజయవాడ వైపు ఫోర్డ్ కారులో డీఎస్పీ కుటుంబంతో వెళ్తుండగా అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. అయితే సమయానికి స్పందించడంతో కారులో ఉన్నవారేవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బయట పడ్డారు. వై జంక్షన్ వద్దకు రాగానే కారు ఇంజిన్లో మంటలు వ్యాపించాయి. దీంతో రోడ్డు పక్కన కారు ఆపుజేసి కారులో ప్రయాణిస్తున్న వారంతా వెంటనే బయటకు దిగారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. కానీ అప్పటికే కారు పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ ప్రమాదానికి కూడా షార్ట్ సర్క్యూటే కారణమని అగ్నిమాపక అధికారులు తెలిపారు.
నిన్న బుధవారం హైదరాబాద్‌లోని సైఫాబాద్ రోడ్డు వద్ద మధ్యాహ్నం సమయంలో నడుస్తున్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కారు లక్డీకాపూల్ నుంచి ఖైరతాబాద్ వైపు వెళ్తుండగా మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ కారును రోడ్డు పక్కన ఆపుజేసి, వెంటనే దిగిపోయాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే కారులో మంటలు చెలరేగాయి. సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంపు నుంచి అగ్నిమాపక యంత్రాలను తీసుకొచ్చిన పోలీసులు మంటలను అదుపు చేశారు. పాత కారు కావడంతో కారులో షార్ట్ సర్క్యూట్ అయ్యి, మంటలు చెలరేగి ఉంటాయని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.