మహబూబ్‌నగర్, డిసెంబర్ 6: మళ్లీ పిచ్చికుక్కల దాడులు మొదలయ్యాయ్. నిన్నమొన్నటి వరకు కంటిపై కునుకులేకుండా చేసిన కుక్కలు మళ్లీ దాడులకు తెగబడుతున్నాయ్. తాజాగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. తాజాగా మహబూబ్‌నగర్‌లో ఓ కుక్క ఏకంగా 24 మంది పిల్లలపై దాడి చేసి, తీవ్రంగా గాయపరిచింది. వివరాల్లోకెళ్తే..
రాష్ట్రంలోని వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో దాదాపు 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గురువారం రాత్రి 7 నుంచి 8.30 గంటల ప్రాంతంలో గోల్ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఓ పిచ్చికుక్క స్థానికులను భయకంపితులను చేసింది. చిన్నారుల వెంట పడి కరుస్తూ పలువురిని గాయపరిచింది. పిచ్చికుక్క దాడిలో దాదాపు 24 మంది చిన్నారులు గంటల వ్యవధిలోనే గాయపడ్డారు. చిన్నారులందరికీ జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్‌వీ టీకాలు ఇచ్చారు. వీరిలో ఐదుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వారిని జనరల్ ఆస్పత్రిలో చేర్పించుకుని డాక్టర్ల పరిశీలనలో ఉంచినట్లు ఆర్‌ఎంవో డాక్టర్ జరీనా తెలిపారు.
పిచ్చికుక్క దాడిలో గాయపడిన చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లాలోని కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని, వాటికి ఇంజెక్షన్లు వేయించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. మరో ఘటనలో ఇంటి ముందు ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులపై వీధికుక్క ఒకటి దాడి చేసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురంలో ఈ ఘటన జరిగింది. కొల్లాపురంలో నివాసం ఉంటున్న మహేశ్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్చితానంద గురువారం సాయంత్రం ఇంటి ముందు ఉన్న స్థలంలో ఆడుకుంటున్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదుగానీ ఓ పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు గమనించి చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. వెంటనే గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.