యాదాద్రి వైభోగం..కాళేశ్వర వైభవం..తెలంగాణ 2019 స్పాట్‌ లైట్‌..

తెలంగాణలో 2019 అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. చేదు, తీపి, వగరు వంటి షడ్రుచుల మాదిరిగానే అన్ని రకాల అనుభవాలను పరిచయం చేసింది. రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేసింది. అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏడాది కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.. *యాదాద్రి వైభోగం..ప్రాచీన శిల్పకళా సౌందర్యంః ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు.. ఆకట్టుకునే శిల్పకళాకృతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ […]

  • Anil kumar poka
  • Publish Date - 5:55 pm, Wed, 25 December 19
యాదాద్రి వైభోగం..కాళేశ్వర వైభవం..తెలంగాణ 2019 స్పాట్‌ లైట్‌..

తెలంగాణలో 2019 అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. చేదు, తీపి, వగరు వంటి షడ్రుచుల మాదిరిగానే అన్ని రకాల అనుభవాలను పరిచయం చేసింది. రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేసింది. అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏడాది కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం..

*యాదాద్రి వైభోగం..ప్రాచీన శిల్పకళా సౌందర్యంః
ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆగమ, వైదిక నియమాలు.. ఆకట్టుకునే శిల్పకళాకృతులతో ప్రపంచంలోనే అద్భుతమైన ఆలయంగా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం రూపుదిద్దుకుంటోంది. పునాది నుంచి శిఖరం వరకు పూర్తిగా రాతి శిల్పాలతో సాగడం యాదాద్రి ఆలయ నిర్మాణ విశిష్టతగా చెబుతున్నారు. ప్రకృతి రమణీయతకు నెలవుగా, ఆధ్యాత్మిక భావం ఉట్టి పడే విధంగా ఈ పుణ్యక్షేత్రాన్ని తీర్చిదిద్దాలని సంకల్పించింది తెలంగాణ ప్రభుత్వం. 14.11 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ అభివృద్ధి, 2.10 ఎకరాల విస్తీర్ణంలో ప్రధానాలయం, ప్రాకార మండపాలతో నిర్మాణం తుది దశకు చేరుకుంది. శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ నిర్మాణం చినజీయర్‌ స్వామి సూచనలు, సలహాలు, వాస్తు, పంచరాత్ర ఆగమ శాస్త్ర పద్ధతిలో స్తపతులు పనులను ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో.. సీఎం కేసీఆర్‌ పట్టుదలతో రూ.2,000 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ నిర్మాణం త్వరలోనే పూర్తి కానుంది.

* జూన్‌ 21 మహాద్భుత జలదృశ్యం ఆవిష్కృతంః
తెలంగాణ గడ్డపై మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణలో జలధారలు కురిపించే కాళేశ్వరం ప్రాజెక్ట్ కల సాకారమయ్యింది.. గోదావరి పరవళ్లకు కొత్త నడకలు నేర్పుతూ..రైతుల్లో కొంగొత్త ఆశలు రేకెత్తిస్తూ..కాళేశ్వరం ప్రాజెక్టు శరవేగంగా రూపుదిద్దుకుంది. 2019, జూన్‌ 21న సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. గోదావరి మాత విగ్రహాన్ని ఆవిష్కరించిన కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక‌టి కాదు. ఇది కొన్ని బ్యారేజీలు, పంపు హౌజులు, కాలువ‌లు, సొరంగాల‌ స‌మాహారం. కానీ, అన్నీ ఒక‌దానితో ఒక‌టి సంబంధం ఉన్నవే. గోదావ‌రి నీటిని వీలైనంత ఎక్కువ‌గా వినియోగించుకోవడానికి వీలుగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. ముందుగా అనుకున్నట్టు ప్రాణహిత నదిపై కాకుండా కాస్త కిందకు, ప్రాణహిత నది గోదావరిలో కలిసిన తర్వాత ప్రధాన నిర్మాణం సాగేలా రీడిజైన్‌ చేశారు. ఒక బ్యారేజీలా కాకుండా 3 బ్యారేజీలు, 19 పంపు హౌజులు, వందల కిలోమీటర్ల కాలువలతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని గోదావరి నుంచి దక్షిణాన హైదరాబాద్‌, చిట్యాల, షామీర్‌పేట వరకు నీళ్లొచ్చేలా ఈ కొత్త డిజైన్‌ను చేపట్టారు.

* మహా నగరానికి మెట్రో మణి హారంః
దేశంలోనే రెండో పెద్ద మెట్రోగా  గుర్తింపు పొందిన హైదరాబాద్‌ మెట్రోరైలు ప్రాజెక్టులో 2019లో మరో కీలక అడుగుపడింది. అమీర్ పేట -హైటెక్ సిటీ మార్గం 2019, మార్చి 20న ప్రారంభించారు. దీంతో 18 నిమిషాల్లో అమీర్‌పేట్‌ నుంచి హైటెక్‌ సిటీ చేరుకునే అవకాశం వచ్చింది. జూబ్లీ చెక్‌పోస్ట్‌ నుంచి సింగిల్‌ట్రాక్‌లో మెట్రోరైలు హైటెక్‌సిటీ వరకు వెళ్లి అక్కడి నుంచి తిరిగి వెనక్కి వస్తుంది. నాగోల్‌ నుంచీ హైటెక్‌ సిటీకి మెట్రోలో 55 నిమిషాల్లో వెళ్లొచ్చు. అదే రోడ్డు మార్గంలో వెళ్లాలంటే… ట్రాఫిక్ వల్ల దాదాపు 2 గంటలు పడుతుంది. మొత్తం 4 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఈ ట్రైన్స్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా జంటనగరాల్లో ప్రధాన సమస్యగా నెలకొన్న ట్రాఫిక్‌ కష్టాలకు మెట్రో తో బ్రేకులు పడినట్లయిందనే చెప్పవచ్చు.

* హుజూర్‌నగర్ ఉప ఎన్నికః
అక్టోబర్‌ 21న పోలింగ్‌, 24న ఫలితాలు
పీసీసీ చీఫ్‌గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. దీంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఫలితంగా ఆ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం. హుజూర్‌నగర్ బరిలో టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉత్తమ్ పద్మావతి, బీజేపీ నుంచి కోట రామారావు, టీడీపీ నుంచి చావా కిరణ్మయి పోటీలో నిలబడ్డారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన రోజు నుంచే.. ప్రధాన పార్టీలన్నీ ప్రచారంతో హోరెత్తించాయి. ఆఖరి వరకు.. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలతో.. క్యాంపెయిన్‌లో కాక పుట్టించారు అభ్యర్థులు. అక్టోబర్‌ 21న పోలింగ్‌ ముగిసింది..అక్టోబర్‌ 24న ఫలితాలు రానేవచ్చాయి. కాంగ్రెస్‌కు కంచుకోటలా ఉన్న హుజూర్‌నగర్ ఉప ఎన్నిక ఫలితాలపై మరోసారి కేసీఆర్ వ్యూహాత్మక విధాన ప్రభావం నూటికి నూరు శాతం కనిపించింది. ప్రజలు మరోసారి టీఆర్ఎస్ పార్టీకి జై కొట్టారు.అధికార టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన సైదిరెడ్డి 43, 359 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

* 55 రోజుల ఆర్టీసీ సమ్మె..అంతిమంగాః
చారిత్రలో ఎన్నాడూ లేని విధంగా 2019లో టీఎస్‌ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. ఓ వైపు హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రకటన, మరోవైపు ఆర్టీసీ సమ్మె ప్రభుత్వాన్ని కాస్త ఇరకాటంలో పడేసిందనే చెప్పవచ్చు. 2019 అక్టోబరు 4 అర్థరాత్రి నుండి సమ్మె మొదలై, నవంబరు 25 న ముగిసింది. మొత్తం ఉద్యోగులు 49,860 మందిలోను 48,660 మంది వరకూ సమ్మెలో పాల్గొన్నారు. అక్టోబరు 8 వ తేదీన దసరా పండుగ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి స్వగ్రామాలకు చేరుకుని, పండుగ తరువాత వెనక్కి వెళ్ళే ప్రజలకు ఈ సమ్మె ఇబ్బందులు కలిగించింది. కార్మికులు, ప్రభుత్వము ఇద్దరూ కూడా తమతమ అభిప్రాయాలకు కట్టుబడి, మెట్టు దిగకపోవడంతో ఇరువర్గాల మధ్య మూడు రోజుల పాటు జరిగిన చర్చలు విఫలమై సమ్మె అనివార్యమైంది. ప్రభుత్వం ఈ సమ్మె పట్ల చాలా కఠిన వైఖరి అవలంబించింది. సమ్మెను క్రమశిక్షణా రాహిత్యంగా భావించి, సమ్మెలో పాల్గొన్న కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు కానట్లే అని ప్రకటించింది. బేషరతుగా సమ్మె విరమించాక, విధుల్లో చేరేందుకు వచ్చిన కార్మికులను రెండు రోజుల పాటు అందుకు అనుమతించలేదు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమైనదని ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనితో పాటు దాఖలైన మరికొన్ని అర్జీలపై హైకోర్టు అక్టోబరు 15 న విచారణ చేపట్టింది. ఇరుపక్షాలూ మెట్టు దిగి సమ్మెకు ముగింపు పలకాలని సలహా ఇచ్చింది. 52 రోజులుగా చేస్తున్న సమ్మెను విరమిస్తున్నట్లుగా నవంబరు 25 న కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ప్రకటించింది. హైకోర్టు తీర్పును, ఆర్టీసీ కార్మికుల అవసరాలనూ దృష్టిలో పెట్టుకొని సమ్మెను బేషరతుగా విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. మూడు రోజుల తరువాత, నవంబరు 28 న, కార్మికులు బేషరతుగా విధుల్లో చేరవచ్చని ముఖ్యమంత్రి ప్రకటించడంతో నవంబరు 29 ఉదయం నుండి కార్మికులు తమ పనుల్లోకి చేరిపోయారు.

* దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘దిశ’ సంఘటనః
నవంబర్‌ 27 శంషాబాద్‌లో జరిగిన దిశ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సాయం చేస్తామని నమ్మించి.. వెటర్నరీ డాక్టర్‌పై సామూహిక అత్యాచారం చేసి అనంతరం హత్య చేసి పెట్రోల్ పోసి తగలబెట్టడం అందర్నీ కలచివేసింది. డిసెంబర్ 6న సీన్ రీ కన్‌స్ట్రక్షన్ సమయంలో.. నిందితులు పోలీసులపై దాడికి ప్రయత్నించగా.. కాల్పుల్లో హతమయ్యారు. ఈ ఎన్‌కౌంటర్‌పై తొలుత దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తం చేసినవారు ఆ తర్వాత దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తుండడంతో ఈ వ్యవహారం అసక్తికర మలుపులు తిరిగింది. జరిగిన ఘటనపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిషన్‌ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీచేసింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి విఎస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రేఖా ప్రకాష్‌, సిబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌ సభ్యులుగా నియమిస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బోబ్డే ధర్మాసనం ఉత్తర్వులిచ్చింది. ఎన్‌కౌంటర్‌పై ఆరునెల్లల్లో విచారణ జరిపి నివేదిక అందచేయాలని కమిషన్‌కు సూచించింది.

* అమల్లోకి దిశ చట్టంః
దిశ కేసులో సరైన న్యాయమే జరిగిదంటూ ఒకానొక సందర్భంలో యావత్‌ భారతవని ప్రశసించింది. ఈ ఘటనతో ఢిల్లీ నిర్భయ, విజయవాడ అయేషా మీరా తల్లిదండ్రలు సైతం తమ బిడ్డలకు ఇలాంటి న్యాయమే కావాలనే డిమాండ్‌ వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇటువంటివే అనేక సంఘటనలు దిశ ఎఫెక్ట్‌తో బయటపడ్డాయి. కాగా, దిశ సంఘటనతో రాష్ట్రవ్యాప్తంగా ఫాస్ట్‌ కోర్టుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల సత్వర విచారణకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు డిసెంబర్ 19, 2019న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో దిశ చట్టాన్ని అమల్లోకి తెచ్చారు. ఏ అత్యాచార కేసు నమోదైనా… అది 14 రోజుల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన సాక్ష్యాధారాలు ఉంటే… దోషులకు కేసు నమోదైనప్పటి నుంచీ 21 రోజుల్లో శిక్ష అమలు చెయ్యాల్సి ఉంటుందని ఆ చట్టంలో పొందుపరిచారు.