పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో కొల్లాపూర్ కోలాహలంగా మారింది. పట్టణంలో 1930లో స్థాపించిన రాణి ఇందిరా దేవి పాఠశాల, 1979లో ఏర్పాటు చేసిన రాణి ఇందిరా దేవి బాయ్స్ కాలేజ్ గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది పూర్వ విద్యార్థుల సంఘం. ఈ విద్యాసంస్థలతో అనుబంధం ఉన్న విద్యార్థులంతా ఒక్కచోట కలవబోతున్నారు. దాదాపు 2వేల మంది పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు.
గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు నేటి నుంచి ఈనెల 29 వరకు జరుగనున్నాయి. మొదటి రోజు మంత్రి జూపల్లి కృష్ణారావు, మైహోం గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు, BITS వీసీ రాంగోపాల్ రావు వేడుకలను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం పలు యూనివర్సిటీల వీసీలతో ప్యానెల్ డిస్కషన్స్‌ను నిర్వహిస్తారు. అనంతరం రాణీ ఇందిరా దేవి పేరిట అవార్డ్స్ ప్రదానం చేస్తారు. అనంతరం ప్రజా వాగ్గేయకారులు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్నతో కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
వేడుకల్లో రెండో రోజు ప్రభాతభేరీ కార్యక్రమానికి సినీనటుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సాయంత్రం ప్రజా వాగ్గేయకారులు అందెశ్రీ, జయరాజ్‌తో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
గోల్డెన్ జూబ్లీ ముగింపు వేడుకలకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. సక్సెస్ స్టోరీస్ థీమ్ తో ప్యానల్ డిస్కషన్, ఆర్ఐడీ అవార్డ్స్ కార్యక్రమం ఉంటుంది. ఈవెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇండియన్ ఐడల్ టీమ్‌తో మెగా మ్యూజికల్ బ్యాండ్ కార్యక్రమం ఉంటుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..