TPCC Chief: రేపో, మాపో అంటూ ఊరిస్తున్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారంలో కదలిక ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ఢిల్లీ చేరుకోవడంతో పాటు రేసులో పోటీపడుతున్న ఇద్దరు నేతలు సైతం ఢిల్లీలో ఉండడంతో మళ్లీ అలాంటి ఊహాగానాలకు తెరలేచినట్లైంది. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పంజాబ్ రాష్ట్రంలో తలెత్తిన అంతర్గత విబేధాలను చక్కదిద్దే పనిలో నిమగ్నమై ఉందని టాక్ వినిపిస్తోంది. ఈ వ్యవహారం తేల్చిన తర్వాతే తెలంగాణ పీసీసీ ఎంపికపై అగ్రనాయకత్వం దృష్టి సారించవచ్చని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.
కాంగ్రెస్ చరిత్రలో తొలిసారిగా రాహుల్ గాంధీ సూచన మేరకు రాష్ట్రంలోని నేతల అభిప్రాయం ఆధారంగా పీసీసీ అధ్యక్షుణ్ణి ఎంపిక చేసేందుకు గత ఏడాదే కసరత్తు జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్యం ఠాగూర్ ద్వారా చేపట్టిన ఈ కసరత్తులో సుమారు 170 మంది నేతల అభిప్రాయాలను రికార్డ్ చేశారు. వారిలో రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా కమిటీ అధ్యక్షులు, రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు ఉన్నారు. అయితే, వీరిలో ఎక్కువ మంది రేవంత్ రెడ్డి పేరును సూచించినట్టు ఏఐసీసీ వర్గాల సమాచారం. మెజారిటీ నేతల అభిప్రాయంతో పాటు అధ్యక్ష పదవి ఆశిస్తున్న మరికొందరు నేతల పేర్లను ప్రతిపాదిస్తూ ఠాగూర్ ఒక నివేదికను అధిష్టానానికి అందజేసినట్టు తెలిసింది. దీనిపై అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుని కొత్త అధ్యక్షుణ్ణి ప్రకటించే సమయానికి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు తెరపైకి రావడంతో రాష్ట్రానికి చెందిన సీనియర్ నేతలు ప్రకటన వాయిదా వేయాలని కోరారు. దాంతో కాంగ్రెస్ అధిష్టానం టిపిసిసి ఛీప్ ప్రకటనను వాయిదా వేసింది. అలా వాయిదా పడ్డ ప్రకటన.. ఇప్పటికీ విడుదల కాలేకపోతోంది. దీనికి మరో కారణం కూడా ఉందంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు. అధ్యక్ష పదవి ఆశిస్తున్న సీనియర్ నేతలతో పాటు, పార్టీలో మొదటి నుంచి ఉన్న మరికొందరు సీనియర్ నేతల వల్లే పీసీసీ చీఫ్ ప్రకటన ఆలస్యమవుతోందంటున్నారు.
పీసీసీ అధ్యక్ష పదవిని రేవంత్ రెడ్డికి ఇవ్వొద్దంటూ వీ. హనుమంతరావు వంటి నేతలు బహిరంగంగానే వ్యతిరేకిస్తుండగా, మిగతా నేతలు లేఖల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్లను కాదని, బయటి నుంచి వచ్చిన వ్యక్తికి అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే మిగతా సీనియర్ నేతలు ఇమడలేరని, పార్టీని వీడి వెళ్లిపోయే ప్రమాదముందని అగ్రనాయకత్వానికి సంకేతాలు పంపుతున్నారు. తటస్థంగా ఉన్న నేతలు సైతం అందరినీ కలుపుకుపోయే వ్యక్తికే పీసీసీ పగ్గాలు అప్పగించాలని, లేదంటే పార్టీలో నేతలు గ్రూపులుగా విడిపోయి మరింత నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీహెచ్ వంటి నేతలు మాణిక్యం ఠాగూర్ ఇచ్చిన నివేదికను సైతం తప్పుబడుతున్నారు. ఆయనొక్కడే వచ్చి తమిళంలో రాసుకుపోయిన అభిప్రాయాల కంటే, కర్నాటక పీసీసీ ఎంపిక సమయంలో జరిగినట్టుగా ఏఐసీసీ నుంచి కొందరిని అబ్జర్వర్లుగా రాష్ట్రానికి పంపించి, అభిప్రాయ సేకరణ చేయాలని వీహెచ్ డిమాండ్ చేస్తున్నారు. మొత్తంగా సీనియర్ల వ్యతిరేకత, ఒత్తిడి కారణంగా అధిష్టానం కసరత్తు మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో ఇవాళ, రేపు అనుకున్న ప్రకటన కాస్తా మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక పంజాబ్ రాష్ట్రంలో నెలకొన్న వర్గ విబేధాలపై అధిష్టానం ప్రస్తుతం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్, రేపు సోనియా గాంధీని కలవనున్నారు. పంజాబ్ వ్యవహారాన్ని తేల్చిన వెంటనే తెలంగాణ పీసీసీ వ్యవహారాన్ని చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి ఎంపిక విషయంలో జరుగుతున్న జాప్యమే ఆ పార్టీకి ఎక్కువ నష్టం కలిగిస్తోందని పార్టీలో పలువురు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈటల రాజేందర్ వంటి నేతలు సైతం టీపీసీసీ నాయకత్వంలో నెలకొన్న సందిగ్ధత కారణంగానే కాంగ్రెస్‌లో చేరకుండా, బీజేపీవైపు వెళ్లారని చెప్పుకుంటున్నారు. పార్టీ శ్రేణుల్లోనూ రోజురోజుకూ నైరాశ్యం పెరిగిపోతోందని, ఫలితంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రత్యర్థి స్థానంలో బీజేపీ పాతుకుపోయే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన చెందుతున్నారు. అధిష్టానం ఇప్పటికైనా త్వరగా ఈ కసరత్తు పూర్తిచేసి కొత్త నేత పేరును ప్రకటించాలని వారు కోరుకుంటున్నారు. కొత్త నాయకత్వం విషయంలో తప్పుడు నిర్ణయం తీసుకుంటే జరిగే నష్టం కంటే, నిర్ణయం తీసుకోకుండా చేస్తున్న జాప్యం కారణంగానే పార్టీకి ఎక్కువ నష్టం వాటిల్లుతోందని వారంటున్నారు. ఈ పరిస్థితుల్లో వారం రోజుల్లోపే అధిష్టానం కసరత్తును పూర్తిచేసి కొత్త నాయకత్వాన్ని ప్రకటించే అవకాశముందని ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
మహాత్మా కొడియార్
టీవీ9, ఢిల్లీ.
Also read: