Telangana Politics: సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం.. ఎవరి సీటుకు ముప్పు పొంచిఉందంటే..!

|

Dec 30, 2021 | 10:07 PM

Nalgonda Politics: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం జ‌రుగుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని ఓ ఎన్ఆర్ఐ కోరుతున్నారా?

Telangana Politics: సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం.. ఎవరి సీటుకు ముప్పు పొంచిఉందంటే..!
Follow us on

Nalgonda Politics: ఆ నియోజ‌క‌వ‌ర్గంలో సిట్టింగ్ సీటుకు ఎస‌రు పెట్టే ప్రయ‌త్నం జ‌రుగుతోందా? వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే టికెట్ ఇవ్వాల‌ని ఓ ఎన్ఆర్ఐ కోరుతున్నారా? పార్టీ అధిష్టానంలో కీల‌క నేత మ‌ద్దతుతో టికెట్ త‌నదే అన్న ధీమాలో ఆ ఎన్ఆర్ఐ ఉన్నారా? అవినీతి అక్రమాలతో బాణం ఎక్కుపెట్టిన ఎన్నారై ప్రయత్నాలు ఆ ఎమ్మెల్యేకు మింగుడు పడడం లేదా. ఆ ఎమ్మెల్యేకు.. ఎన్ఆర్ఐ కొరకు రాని కొయ్యగా మారుతున్నాడా.. ఆ ఎమ్మెల్యే ఎవరు..? ఆ నియోజకవర్గం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే.

సూర్యాపేట జిల్లాలో ఉన్న నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల్లో కోదాడ ఒక‌టి. తెలంగాణ-ఆంధ్రా బార్డర్ ఉన్న నియోజ‌క‌ వ‌ర్గం కావ‌డంతో దీనికి ప్రాధాన్యత కూడా ఎక్కువ. అలాంటి నియోజ‌క‌వ‌ర్గంలో గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బొల్లం మ‌ల్లయ్య యాద‌వ్.. కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ ప‌ద్మావ‌తి రెడ్డిపై స్వల్ప తేడాతో ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. ఎన్నిక‌లకు మ‌రో రెండేళ్ల సమయం ఉన్న నేప‌థ్యంలో పార్టీలో కొత్త నేత‌లు తెర‌పైకి వ‌స్తున్నారు.

ఆ కోవ‌లోకి చెందినవారే ఎన్నారై జలగం సుధీర్. కేటీఆర్‌, హ‌రీష్ రావులకు ద‌గ్గరి మ‌నిషిగా చెప్పబ‌డే జ‌ల‌గం సుధీర్.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ రేసులో దూసుకొస్తున్నారట. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలోనే టికెట్ రావాల్సి ఉన్నా తృటిలో చేజారిపోయింద‌ని ఈసారి ఖ‌చ్చితంగా టికెట్ త‌న‌కే వ‌స్తుందనే ధీమాలో సుధీర్ ఉన్నాడట. ఈ నేప‌థ్యంలో మ‌ల్లయ్యలో టెన్షన్ పెరిగిపోయిందంట. గ‌త కొన్ని రోజులుగా జలగం సుధీర్ నియోజ‌క‌వ‌ర్గంలో మ‌ళ్లీ యాక్టీవ్‌గా తిరుగుతుండ‌టం, క్యాడ‌ర్‌కు నిత్యం అందుబాటులో ఉండ‌టంతో ఇన్నాళ్లు అవ‌కాశం రాక ఏదో విధంగా స‌ర్దుకుపోయిన మ‌ల్లయ్య వ్యతిరేకులంతా సుధీర్‌కు ద‌గ్గర అవుతున్నారంట. దీనికి తోడు సుధీర్‌.. కేటీఆర్, హ‌రీష్‌రావుకు ద‌గ్గర అన్న ప్రచారం ఉంది. దీంతో ఎలా అయినా వారి ద్వారా టికెట్ తెచ్చుకునేందుకు విశ్వ ప్రయ‌త్నాలు చేస్తున్నారట‌.

మ‌రోవైపు నియోజ‌క‌వ‌ర్గంలో జ‌రుగుతున్న ప్రతీ విష‌యాన్ని కేటీఆర్ దృష్టికి సుధీర్ తీసుకెళ్తున్నార‌ని టాక్. గ‌తంలో 700 ఎక‌రాలకు పైగా విస్తీర్ణం ఉన్న కోదాడ పెద్ద చెరువు క‌బ్జాపై కూడా హ‌రీష్‌తో పాటు కేటీఆర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీంతో అధికార యంత్రాంగం స్పందించి కోదాడ పెద్ద చెరువుపై రాష్ట్రస్థాయి టాస్క్ఫోర్స్ బృందంతో విచారణకు ఆదేశించింది. దీన్ని అవకాశంగా మలుచుకున్న సుధీర్.. ఆక్రమ‌ణ‌ల నుంచి తానే పెద్ద చెరువును కాపాడాన‌ని ప్రచారం చేసుకుంటున్నారట. కోదాడ మున్సిపాలిటీలో 70 పోస్టుల భర్తీలో అవినీతి అక్రమాలు జరిగాయనే అంశాన్నికూడా మంత్రులు కేటీఆర్, హరీష్ రావుల దృష్టికి తీసుకెళ్ళారు సుధీర్. ఈ పోస్టుల భర్తీలో పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారాయని సోషల్ మీడియా ద్వారా ఆయన ప్రచారం చేశారు. దీంతో ఇప్పుడు కోదాడ నియోజక వర్గంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్.. జలగం సుధీర్ మధ్య కోల్డ్ వార్ కొనసాగుతోంది.

సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూనే కోదాడ నియోజక వర్గంలో అభివృద్ధిని పరోక్షంగా ప్రస్తావిస్తున్నారు జలగం సుధీర్. నియోజకవర్గంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యపై గురి పెడుతున్నాడు. ఇలా నియోజక వర్గంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పై పెరుగుతున్న వ్యతిరేకతను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు సుధీర్. దీంతో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కు జలగం సుధీర్ కొరకరాని కొయ్యగా మారారు. అంతేకాదు.. జలగం ఫౌండేషన్ ద్వారా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గర అవుతున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చే మహిళల కోసం ప్రత్యేకంగా కోదాడలో టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు ప్రయత్నిస్తున్నారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో టీఆర్‌ఎస్ అధిష్టానం ఆలోచ‌న ఏవిధంగా ఉండ‌బోతోంది?. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఎవ‌రికి రాబోతోంది?. ఒక‌వేళ కేటీఆర్ ద్వారా టికెట్ సుధీర్‌కు వ‌స్తుందా?. టికెట్ త‌న‌కు కాకుండా ఇత‌రుల‌కు ఇస్తే మ‌ల్లయ్య స‌హ‌కరిస్తారా? లేదా? అన్న ప్రశ్నల‌కు సమాధానం రానున్న రోజుల్లో దొర‌క‌నుంది.

Also read:

Police vs Mafia: పోలీస్ శాఖపై మాజీ మంత్రి సంచలన కామెంట్స్.. లోకల్ మాఫియాలో వారి ప్రమేయం ఉందంటూ..

BJP Bandi Sanjay: ఉపాధ్యాయుల బదిలీల్లో అవకతవకలు.. సంచలన ఆరోపణలు చేసిన బండి సంజయ్..

Telangana – Agriculture: రైతు బంధు అసలు ఉద్దేశం అదే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మంత్రి..