రాజకీయాల్లో నేతల మధ్య మాటల యుద్ధం సర్వ సాధారణం.. తెలంగాణలో ఇది ఇంకాస్త ఎక్కువగానే కొనసాగుతుందని చెప్పొచ్చు. మాటల దాడిలో ముందుండే సీఎం రేవంత్.. ఆయన వ్యాఖ్యలకు ధీటుగా బదులిచ్చే బీఆర్ఎస్ వర్కింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్స్‌తో తెలంగాణ రాజకీయం ఎప్పటికప్పుడు హాట్ హాట్‌గానే సాగుతోంది. ఓ వైపు ఈ మాటల తూటాలు పేలుతుండగానే.. నేతల మధ్య లీగల్ వార్ కూడా అదే స్థాయిలో కొనసాగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
రాజకీయ నేతల పరస్పర ఆరోపణలతో తెలంగాణ రాజకీయం ఎప్పటికప్పుడు రసవత్తరంగా సాగుతోంది. కొన్నిసార్లు నాయకుల మధ్య మాటల యుద్ధం.. శృతి మించుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కొందరు నేతలు తమపై ఇతరులు చేసే ఆరోపణలకు కౌంటర్‌గా లీగల్ నోటీసులు కూడా ఇస్తున్నారు. తెలంగాణలో కొంతకాలంగా ఈ లీగల్ నోటీసుల పర్వం గట్టిగానే సాగుతోంది. అయితే లీగల్ నోటీసులు ఇచ్చిన, తీసుకున్న నాయకుల జాబితాలో కేటీఆర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
లేటెస్ట్‌గా తనపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేశారంటూ బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్. తనపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని లేకపోతే లీగల్‌గా తాను తీసుకునే చర్యలు ఎదుర్కోవాలని సూచించారు కేటీఆర్. ఈ వ్యవహారంలో కేటీఆర్‌తో లీగల్‌గానే పోరాడతానని బండి సంజయ్ ప్రకటించగా.. ఇందుకు తాను కూడా సిద్ధమేనని మరోసారి రియాక్ట్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాటకు మాట.. నోటీసుకు నోటీసుతోనే జవాబిస్తానంటూ బండి సంజయ్ ప్రకటించారు.
ఇక కొద్దిరోజుల క్రితం మంత్రి సురేఖ తనపై చేసిన వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆమెపై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్.. బుధవారం ఈ కేసుకు సంబంధించిన వాంగ్మూలం ఇచ్చేందుకు నాంపల్లి స్పెషల్ కోర్టుకు హాజరయ్యారు. కొండాసురేఖ వ్యాఖ్యల వీడియోను కోర్టుకు సమర్పించిన కేటీఆర్.. కోర్టుకు తన వాంగ్మూలాన్ని సమర్పించారు.
అమృత్ పథకం టెండర్ల విషయంలో తనపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేటీఆర్‌కు సృజన్ రెడ్డి గత నెలలో లీగల్ నోటీసులు ఇచ్చారు. తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలుచేసినందుకు కేటీఆర్, బీఆర్‌ఎస్ పార్టీకి నోటీసులు అందించారు. తప్పుడు వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని సృజన్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. సీఎం రేవంత్ తన బావమరిదితో లీగల్ నోటీసు పంపితే మాట్లాడటం ఆపబోమని కామెంట్ చేశారు. బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. ఇలా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి నాయకత్వం వహిస్తున్న నేతగా ప్రత్యర్థుల కామెంట్స్‌కు కౌంటర్ ఇస్తున్న కేటీఆర్.. లీగల్ వార్‌కు కూడా సై అంటున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..