
Bandi Sanjay Arrest: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంలో కరీంనగర్ సీపీ సహా ఇతర పోలీసు సిబ్బంది ఇవాళ ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరుకానున్నారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణతో పాటు మరికొందరు పోలీస్ అధికారులు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరుకానున్నారు. బీజేపీ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ వ్యవహారంపై వివరణ ఇవ్వనున్నారు. కాగా, ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో.. కమిటీ సమావేశానికి హాజరుకాలేమని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. దీంతో ప్రివిలేజ్ కమిటీ అనుమతి మంజూరు చేసినట్టు తెలుస్తోంది.
జనవరి 2వ తేదీన ఉద్యోగుల సమస్యలపై దీక్ష చేపట్టిన బండి సంజయ్ ఆఫీసులోకి వెళ్లి అరెస్టు చేయడంపై ఆయన లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఎంపీగా ఉన్న తన విధులకు అడ్డుతగిలి, తనపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. తన పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును వివరిస్తూ అక్రమంగా అరెస్టు చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఢిల్లీలో ప్రివిలేజ్ కమిటీ ముందు హాజరై పూర్తి వివరాలు అందించారు బండి సంజయ్. తన ఇంటిపై పోలీసులు దౌర్జన్యం, అరెస్టును తెలంగాణ హైకోర్టు తప్పుపట్టిన విషయాన్ని కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. తనను వెంటనే విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరీంనగర్ సీపీ సత్యనారాయణ, ఇతర పోలీసులు తనపై దాడి చేయడం ఇది రెండోసారన్నది బండి సంజయ్ ఆవేదన.
గతంలో ఆర్టీసీ కార్మికుడు నగునూరు బాబు అంత్యక్రియలకు వెళ్లడానికి ప్రయత్నించినపుడు కూడా పోలీసులు అడ్డుకొని తనపై క్రూరంగా దాడికి పాల్పడినట్లు కమిటీకి వివరించారు ఎంపీ. అరెస్టు ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ వాదనలు విన్న కమిటీ.. ఆయన సమర్పించిన ఆధారాలు, వీడియో క్లిప్పింగులను పరిశీలించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ గుప్తా, కరీంనగర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ సహా ఇతర పోలీసు అధికారులకు లోక్‌సభ ప్రివిలేజ్ కమిటీ జనవరి 22న సమన్లు జారీ చేసింది. దీని ప్రకారం ఇవాళ కమిటీ ముందు హాజరు కావాల్సి ఉంది.
Also read:
Sehari Movie: అప్పుడే హర్ష నటనకు అభిమానిగా మారిపోయాను.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్..