తెలంగాణ ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ నియామకాలకు సంబంధించి తుది ఫలితాలు మంగళవారం (మే 30) తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) ప్రకటించింది. టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ మొత్తం 8 విభాగాల్లో తుది రాతపరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీటిల్లో మొత్తం 84.06 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులకుగాను 1,50,852 మంది ఎంపికైనట్లు తెల్పింది. అభ్యర్థుల సమాధానపత్రాల ఓఎంఆర్ షీట్లతోపాటు, తుది ఆన్సర్ ‘కీ’లను కూడా అధికారిక వెబ్‌సైట్ లో అందుబాటులో ఉంచనున్నట్లు బోర్డు ఛైర్మన్ వివి శ్రీనివాసరావు ప్రకటించారు. సమాధానపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి తప్పులు దొర్లకుండా పటిష్ఠమైన విధానాలను అనుసరించినట్లు ఆయన స్పష్టంచేశారు. అయినా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు అవకాశం కల్పించామన్నారు.
ఒక్కో సమాధానపత్రాన్ని పునఃపరిశీలించేందుకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.2వేలు, ఇతర అభ్యర్థులు రూ.3వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుందన్నారు. జూన్ 1 ఉదయం 8 గంటల నుంచి జూన్ 3వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించే అవకాశం ఉంటుందన్నారు. ఒక్కో సమాధానపత్రం పునఃమూల్యాంకనానికి ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. తుది రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల ధ్రువీకరణపత్రాల పరిశీలన అనంతరమే ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటిస్తామని తెలిపారు.
మరిన్ని కెరీర్ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.