Covishield Vaccine: కరోనా కట్టడికి దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇక కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకోవాల్సిన కనీస వ్యవధిని పెంచుతూ తెలగాణ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయం తీసుకుంది. మొదటి, రెండో డోసుల మధ్య కనీస వ్యవధి 84 రోజుల నుంచి 98 రోజులకు పెంచింది. ఇక నుంచి 98 నుంచి 112 రోజుల మధ్య సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఇప్పటి వరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీచేసిన మార్గదర్శకాలను పాటించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు సొంత నిర్ణయం తీసుకుంది. జూలైలో దాదాపు 30 లక్షల మంది కొవిషీల్డ్ సెకండ్ డోసు తీసుకోవాల్సి ఉండగా, వ్యాక్సిన్ కొరతతో సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కనీసం ఒక్క డోసు వేసుకున్నా ఎంతో కొంత ఇమ్యూనిటీ వస్తుందన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఇక నుంచి 18 సంవత్సరాలు పైబడిన వారికి కూడా టీకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇందు కోసం హైదరాబాద్‌లో 100 టీకా కేంద్రాలు, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మరో 204 వ్యాక్సిన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 636 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ వ్యాక్సిన్ వేయనున్నట్టు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కూడా జారీ చేశారు. పట్టణ ప్రాంతాల్లో అయితే కొవిన్ పోర్టల్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్‌తో సంబంధం లేకుండా వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించినట్టు ఆయన వెల్లడించారు.