Telangana: సర్పంచ్ ఎన్నికల సిత్రాలు.. ప్రజలు మద్ధతు ఇవ్వడం లేదని అభ్యర్థి ఏం చేశాడంటే..?
పంచాయతీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తనకు ఎవరు మద్దతు ఇవ్వడం లేదంటూ ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘనపూర్ సర్పంచ్ స్థానానికి పోటీ చేస్తున్న ఎల్లయ్యకు కుటుంబ సభ్యులు కూడా సహకరించకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో చాలా చోట్ల రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రిజర్వ్‌డ్ పంచాయతీల్లో అభ్యర్థులే కరువైతే.. మరికొన్ని చోట్ల భారీ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిస్తున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా ఎవరూ రావడం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురైన ఓ సర్పంచ్ అభ్యర్థి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. నంగునూరు మండలం ఘనపూర్ సర్పంచ్ స్థానాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్. ఎల్లయ్య అనే వ్యక్తి సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఎల్లయ్య గతంలో ఇదే గ్రామానికి ఉపసర్పంచ్‌గా పనిచేశారు. ఈసారి ఆయన సర్పంచ్ పదవి కోసం ఆశపడి నామినేషన్ దాఖలు చేశారు.
గ్రామంలో ఎన్నికల ప్రచారానికి వెళ్లినప్పుడు కుటుంబ సభ్యులతో సహా గ్రామస్థులు ఎవరూ తనకు సహకరించడం లేదని, మద్దతు ఇవ్వడం లేదని ఎల్లయ్య తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. ఎల్లయ్య పురుగుల మందు తాగిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించారు. అంబులెన్స్ సాయంతో ఆయనను చికిత్స నిమిత్తం హుటాహుటిన సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన చికిత్స పొందుతున్నట్టు సమాచారం. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




