అసెంబ్లీ వేదికగా కేంద్రంపై కేటీఆర్ ఫైర్… స్పెషల్ ప్యాకేజీతో రాష్ట్రానికి ఒరిగిందేమీలేదన్న మంత్రి
కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదన్నారు.
KTR fire on union government: కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఆత్మ నిర్భర్ భారత్ కింద 20 లక్షల కోట్ల ప్యాకేజీతో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్రంలోని పరిశ్రమలకు ఒక్క రూపాయి రాలేదన్నారు. పైగా విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సిన ప్రత్యేక పారిశ్రామిక రాయితీలను కేంద్రం తుంగలో తొక్కిందని విమర్శించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సందర్భంగా పరిశ్రమలకు రాయితీలపై సమాధానం ఇచ్చారు కేటీఆర్.
శాసనసభలో టీఎస్ ఐపాస్ కింద పరిశ్రమలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇస్తూ.. ఏపీ పునర్విభజన చట్టంలో తెలంగాణ, ఏపీ రాష్ర్టాల్లో పారిశ్రామీకీకరణకు సహాయం చేయాలని, రాయితీలు ఇస్తామని పేర్కొన్నప్పటికీ ఎలాంటి సాయం అందలేదన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాయితీలను ఇవ్వాలని తెలంగాణ సర్కార్ కోరుతుందన్నారు. ఆరున్నరేండ్లలో తెలంగాణకు కేంద్రం అణా పైసా కూడా సహాయం చేయలేదు. కేంద్రం తెలంగాణకు చేసింది గుండు సున్నా అని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో చేసిన చట్టాన్నే తుంగలో తొక్కుతున్నారని నిప్పులు చెరిగారు. కేంద్రం తెచ్చిన రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందో ఎవరికి తెలియదన్నారు. ఈ ఆత్మనిర్భర్ ప్యాకేజీ వల్ల తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదన్నారు. కేవలం వీధి వ్యాపారులకు మాత్రమే రూ. 10 వేల లోన్లు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.