Harish Rao: రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంత్రి హరీష్ రావు పాలాభిషేకం
బీజేపీ, కాంగ్రెస్‌పై ఫైరయ్యారు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక రాష్ట్ర రైతులు, ప్రజలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు మంత్రి హరీశ్‌రావు.
Harish Rao fire on BJP and Congress: బీజేపీ, కాంగ్రెస్‌పై ఫైరయ్యారు మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి. తెలంగాణ అభివృద్ధి చూసి ఓర్వలేక రాష్ట్ర రైతులు, ప్రజలను కేంద్రం ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు మంత్రి హరీశ్‌రావు. దేశంలో 20 బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండగా అభివృద్ధిలో మాత్రం వాటికంటే తెలంగాణ ముందున్నదన్నారు. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తున్నదని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణకు రావాల్సిన రూ.130 కోట్ల బీఆర్జీఎఫ్నిధులు ఇవ్వడం లేదని, 15వ ఆర్థిక సంఘం గ్రాంట్పరిస్థితి అంతే ఉందన్నారు. ఇరిగేషన్ప్రాజెక్టులకు అనుమతులు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. బావుల వద్ద మోటార్లకు మీటర్లు పెడితే గ్రాంట్ కింద రూ.25వేల కోట్ల ఇస్తామని చెబితే తమకు అవసరం లేదని కేంద్రానికి తేల్చిచెప్పామని హరీష్‌రావు పునరుద్ఘాటించారు.
వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డితో కలిసి మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట గ్రామంలో రూ. 300 కోట్లతో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ కర్మాగారానికి శంఖుస్థాపన చేశారు. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ది సాధిస్తుంటే బీజేపీ ఓర్వలేకపోతున్నదని హరీష్‌రావు మండిపడ్డారు. 2 నుంచి 3వేల కోట్లు ఖర్చు అయిన ప్రతి రైతు నుంచి చివరి వండ్ల గింజవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. ఇక కాంగ్రెస్‌నేతలు పగటి కలలు కంటున్నారని మంత్రి విమర్శించారు. మేరేం చేశారని అధికారంలోకి వస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ జమానాలో ఒక మడి ఎండకుండా కనీసం కరెంటు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ వస్తే మీకు కరెంట్ కూడా ఉండదు అని కిరణ్ కుమార రెడ్డి అన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆంధ్రలో కరెంట్ కోతలు ఉన్నాయి.. కానీ తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇప్పుడున్న సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు.
సిద్దిపేట జిల్లాను ఆయిల్ ఫామ్ జిల్లాగా ప్రకటిస్తామని, రాష్ట్రంలో మొదటి ఆయిల్ ఫామ్ కర్మాగారం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఎకరానికి లక్ష 50 వేల నికర ఆదాయం వస్తుందని, లక్ష కోట్ల పామాయిల్‌ను భారత దేశం దిగుమతి చేసుకుంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల లాగానే ఆయిల్ ఫెడ్ రైతులకు నెల నెల డబ్బులు వస్తాయన్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో రాష్ట్ర బీజేపీ నేతల విమర్శలపై మండిపడ్డారు. రాష్ట్రం ధాన్యం కొనకపోతే మేం కొంటామని చెప్పిన బటంగి నాయకులు ఎటుపోయారంటూ ఘాటుగా ప్రశ్నించారు. మన దగ్గర పండేది బాయిల్డ్ రైస్ అంటే.. రా రైస్ కొంటాం అని కేంద్రం మనతో తొండి ఆట ఆడుతోందని హరీష్ రావు మండిపడ్డారు.
రైతాంగం నష్టపోవద్దనే ప్రభుత్వం వడ్లు కొనాలని నిర్ణయించుకుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు. సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ తోటలు పెట్టడం, ఇక్కడే రూ.300 కోట్లతో ఆయిల్కర్మాగారం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఏ కార్యక్రమైన సిద్దిపేట నుంచే ప్రారంభం అవుతున్నదని, దేశంలోనే అనేక రంగాలలో సిద్దిపేట ఆదర్శంగా నిలుస్తుందన్నారు. సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తుంటే మంత్రి హరీష్‌రావు వాటిని సమర్థవంతంగా అమలు చేస్తుంటారన్నారు. తమ మొడపై కత్తి పెట్టి ఈ ఆయిల్ ఫామ్ కర్మాగారంను ఇక్కడ ఏర్పాటు చేయించేలా మంత్రి హరీశ్ రావు ఎంతో కృషి చేశారని నిరంజన్‌రెడ్డి చెప్పారు. గత 6 నెలల నుంచి కేంద్రంతో వరి పంచాయితీ నడిచిందని, దేశంలో కేంద్ర ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉన్నదో ఈ పంచాయతీతో తెలిసిందన్నారు. కేంద్రం వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోతారని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తదని సీఎం కేసీఆర్ హామీ ఇవ్వడంతో అన్నదాతల కుటుంబాలు సంతోషంగా ఉన్నాయన్నారు.
గత పాలకులు అనేక దుష్ప్రచారం చేసి ఇతర పంటల వేయకుండా రైతులను మోసం చేశారని ఆరోపించారు. పథకం ప్రకారమే కేంద్రం వరి పంటను తగ్గిస్తున్నదన్నారు. ఆయిల్ ఫామ్ పంట నాలుగేళ్ల తరవాత ప్రారంభం అవుతుందని, ఆయిల్ ఫామ్ రైతులకు ప్రభుత్వ ఉద్యోగుల కంటే స్థిరమైన ఆదాయం వస్తున్నదని మంత్రి వెల్లడించారు. మిగతా పంటలతో పోలిస్తే ఈ పంటకు కోతులు, పందుల బెడద, పంట, చీడ, పీడ, రోగాల బెడద ఉండదన్నారు. ఆయిల్ ఫామ్ తోటలు వేయడం ద్వారా తెలంగాణ రైతు బతుకుల్లో కొత్త వెలుగులు నిండుతాయన్నారు. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అవుతుందని, దీర్ఘ కాలిక పంటలలో ఆయిల్ ఫామ్ చాలాశ్రేష్టం, ప్రధానమైదని నిరంజన్‌రెడ్డి స్పష్టం చేశారు. మూడేళ్లలో 10 లక్షల ఎకరాలలో ఆయిల్ ఫామ్ సాగుచేయాలని, రాబోయే రోజుల్లో భారత ప్రభుత్వమే తెలంగాణ రైతుల కాళ్లు మొక్కి మన పంటను తీసుకుంటుందని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడ కూడా సాగునీరు ఇవ్వడం లేదని, కేసీఆర్ కుటుంబంపై నిందలు తప్ప బీజేపీ నేతలు ఏం చేయలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్రాష్ట్రానికి ఎంతో చేస్తున్నాడని, సన్యాసి కిషన్ రెడ్డి ఏం చేశాడో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పత్తి ప్యాకెట్ల పై కేంద్రం రూ.43 ఎందుకు పెంచిందని ప్రశ్నించారు. వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం 60 వేల కోట్లు ఖర్చు పెడుతుందని తెలిపారు.