కరీంనగర్, ఆగస్టు 18: మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి అలియాస్ సాయన్న (70) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఆధపడుతోన్న రాజిరెడ్డి తుదిశ్వాస విడిచారు. మావోయిస్టు అగ్రనేత, కేంద్ర కమిటీ సభ్యుడు అయిన రాజిరెడ్డి మావోయిస్టుల్లో కలిసిన తర్వాత ఆయనపై ప్రభుత్వం కోటి రివార్డు ప్రకటించింది కూడా. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలో రాజిరెడ్డి కీలకంగా వ్యవహరించాడు. ఆయన దండకారణ్యంలో అనారోగ్యంతో మృతి చెందినట్లు మావోయిస్టులు సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశారు. సామాజిక మాద్యమాల్లో మల్లా రాజారెడ్డి మరణ వార్త వైరల్ కావడంతో కేంద్ర నిఘా వర్గాలు దీనిపై దృష్టిసారించాయి. మరోవైపు రాజారెడ్డి మృతిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు సైతం అధికారికంగా ధృవీకరించారు.
కాగా మల్లా రాజిరెడ్డి స్వస్థలం తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎగ్లాస్‌పూర్ పరిధిలోని శాస్త్రులపల్లి గ్రామం. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా తొలితరం మావోయిస్టు నేతల్లో మల్లా రాజిరెడ్డి ఒకరు. మావోయిస్టు పార్టీలో చిన్నస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన ఆయన కేంద్ర కమిటీ సభ్యునిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో మావోల కార్యకలాపాలలో మల్లా రాజరెడ్డి కీలక పాత్ర పోషించారు. కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లతో కూడిన మావోయిస్టుల నైరుతి ప్రాంతీయ బ్యూరోలో విప్లవాత్మక ఉద్యమానికి ఇన్‌ఛార్జిగా కూడా పనిచేశారు. సంగ్రామ్, సాయన్న, మీసాల సాయన్న, అలోక్, దేశ్‌పాండే, సత్తెన్న వంటి పేర్లతో పలు పేర్లతో మావో కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మల్లా రాజిరెడ్డిపై దేశ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. ఆయనపై పలు రాష్ట్రాల్లో కోటి రూపాయల నజరానా కూడా ఉంది.
పుల్స్ వార్ అగ్రనేతలతో రాజిరెడ్డి కలిసి పనిచేశారు. కొండపల్లి సీతారామయ్య, గణపతి, సత్యమూర్తిలకు రాజిరెడ్డి సహచరుడు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ అయిన శ్రీపాదరావు హత్య కేసులో రాజిరెడ్డి నిందితుడిగా ఉన్నారు. 2008 జనవరిలో కేరళలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పోలీసులు రాజిరెడ్డిని అరెస్ట్ చేసి మెట్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆయన పలు కేసుల్లో నిందితుడిగా తేలడంతో కరీంనగర్ జైలులో రెండున్నరేళ్లు శిక్ష అనుభవించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా తపాల్‌పూర్‌లో నలుగురి హత్య కేసులో, ఉమ్మడి ఏపీలో పీపుల్స్ వార్ తపాల్‌పూర్ ఘటన ఆయన నిందితుడిగా ఉన్నాడు.
1975లో మావోయిస్టు పార్టీకి లో చేరిన మల్ల రాజిరెడ్డి 40 ఏళ్ల పాటు ఉద్యమంలోనే ఉన్నారు. జగిత్యాల జైత్రయాత్ర సమయంలో నక్సల్ ఉద్యమంలో చేరిన మల్ల రాజిరెడ్డి ఒరిస్సా ఛత్తీస్గఢ్లో మావోయిస్టు పార్టీ బలోపేతానికి కృషి చేశారు. జగిత్యాల జైత్రయాత్ర సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లిన మల్లా రాజిరెడ్డి 2008లో కేరళ సరిహద్దుల్లో పోలీసులకు దొరికారు. ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మల్ల రాజిరెడ్డి, 2010లో బయటికి వచ్చారు. 2010లో బయటికి వచ్చిన మల్ల రాజిరెడ్డి ఇంటికి వెళ్తారని అందరూ భావించారు. కానీ ఆయన మళ్లీ అడవి బాటపట్టారు. దాదాపు 40 ఏళ్లపాటు మావోయిస్ట్ పార్టీలో పనిచేసిన వ్యక్తిగా మల్లా రాజీ రెడ్డి కు పేరు ఉంది. ఒరిస్సా, ఛతిస్గడ్ లో మావోయిస్టు పార్టీ నీ బలోపేతం చేయడం లో రాజీరెడ్డి పాత్ర ఉంది.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ లో దాదాపు 11 మంది ఉంటే , దాంట్లో సగానికి పైన తెలంగాణకు సంబంధించిన వాళ్లే మావోయిస్టు సెంట్రల్ కమిటీలో ఉన్నారు. ఇప్పటివరకు తెలంగాణ నుంచి సెంట్రల్ కమిటీలో లో గణపతి , మల్లోజుల వేణుగోపాల్ , గాజర్ల రవి , తిప్పిరీ తిరుపతి , కట్టా రామచంద్రారెడ్డి , మరియు మొడం బాలకృష్ణ ఉన్నారు. మరోవైపు ఇప్పటికే తెలంగాణ నుంచి చనిపోయిన కేంద్ర కమిటీ సభ్యుల్లో కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ , కిషన్ జి ,రామన్న హరి భూషణ్ , ఆర్కే కడకం సుదర్శన్ కిషన్ జి ఈ రకంగా మావోయిస్టు పార్టీకి ఒకప్పుడు ఆయువు పట్టుగా ఉన్న కీలక నేతలంతా ఇప్పుడు చనిపోవడం మావోయిస్ట్ పార్టీని తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. అనారోగ్యం మావోయిస్టు అగ్రనేతులను మింగుతుందన్న ఆందోళన పార్టీలో నెలకొంది..కోటి రూపాయల రివార్డు కలిగి ఉన్న మల్లా రాజిరెడ్డికి తెలంగాణతో చాలా దగ్గరి సంబంధం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.