
తెలుగు రాష్ట్రాల్లో గుండెపోటు మరణాలు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. ఇరు రాష్ట్రాల్లో రోజురోజుకు గుండెపోటు మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా కామారెడ్డి జిల్లాలో మరో గుండె ఆగింది. ఫోన్ మాట్లాడుతూ గుండెపోటుకు గురై ఓ యువకుడు మృతి చెందాడు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీరాంనగర్ కాలనీకి చెందిన గోనె సంతోష్ 33 వయస్సు గల యువకుడు ఇంట్లో ఫోన్ మాట్లాడుతుండగా గుండెపోటుతో కుప్పకూలాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతనిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోనీ ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. అయితే దురదృష్టవశాత్తూ అతని ప్రాణాలు నిలబడలేదు. యువకుని మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉంటే గత ఐదు రోజుల్లో కామారెడ్డి జిల్లాలో గుండెపోటుకు గురై నలుగురు మృతిచెందడం గమనార్హం. మొన్నటికి మొన్న జిల్లాలోని గాంధారి మండల కేంద్రానికి చెందిన అహ్మద్ (35) మండల కేంద్రంలో బైక్ పై పని నిమిత్తం వెళ్తుండగా గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ఆ ఘటన మరువకముందే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గంజి స్కూల్ ఉన్నత పాఠశాల ముందు కామారెడ్డి జిల్లా కేంద్రంలో నివసిస్తున్న మదర్(40) ఆటో డ్రైవ్ చేస్తున్న సమయంలో గుండెపోటుకు గురై కన్నుమూశాడు.
ఇక నిన్న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో నివసిస్తున్న మహమ్మద్ మోమిన్ (39) మస్కట్ దేశంలో తన రూములో గుండెపోటుకు గురై మంగళవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచాడు. తాజాగా గోనె సంతోష్ మృతి చెందాడు. ఇలా వరుస గుండెపోటు మరణాలతో కామారెడ్డి జిల్లా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..