సమస్యల పరిష్కారానికి వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేస్తుంటారు. డిమాండ్ల సాధన కోసం చాల మంది ధర్నాలు, ఆందోళనలు చేస్తుంటారు. కొందరైతే ఆమరణ దీక్షకు దిగుతారు. మరికొందరు ప్రభుత్వ భవనాలు, సెల్ టవర్లు ఎక్కి హల్ చల్ చేస్తుంటారు. కానీ ఓ యువకుడు తన కోరికను నెరవేర్చుకునేందుకు ఏం చేశాడో తెలుసా..? ఆ యువకుడిని శాంతింపచేసేందుకు జనం నానా తంటాలు పడ్డారు. యువకుడి కోరికపై హామీ ఇచ్చేందుకు పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. అసలా యువకుడి డిమాండ్ ఏంటి..? ఏం చేశాడా యువకుడు..! తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
యుక్త వయస్సు రాగానే యువతీ, యువకులు పెళ్లి చేసుకునేందుకు సిద్ధమవుతారు. కొందరు పెద్దలు కుదిర్చిన సంబంధాలను పెళ్లి చేసుకుంటారు. మరికొందరు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అయితే ఇటీవలి కాలంలో ఎక్కడా చూసిన పెళ్ళికాని ప్రసాదులే కనిపిస్తున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం ముత్తి రెడ్డి కుంటకు చెందిన ఎండి ఖలీముద్దీన్ మద్యానికి బానిసై పని పాట లేకుండా తిరుగుతున్నాడు. దీంతో ఖలీమొద్దిన్ కు పిల్లను ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తనకు పెళ్లి కావట్లేదంటూ మద్యం మత్తులో సాగర్ రోడ్డులోని ప్రచార హోర్డింగ్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. తనకు వివాహం చేస్తానని మాట ఇవ్వకపోతే దూకుతానని బెదిరించాడు. అటుగా వెళ్తున్న జనం చూసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఖలీమొద్దిన్ తల్లిదండ్రులను ఘటన స్థలానికి పిలిపించారు. పోలీసులు, తల్లిదండ్రులు నచ్చ జెప్పి కిందికి దింపి దించే ప్రయత్నం చేశారు. పెళ్లి చేస్తామని హామీ ఇచ్చిన తల్లిదండ్రులు, పోలీసులు రెండు గంటలు శ్రమించి ఫైర్ సిబ్బంది సాయంతో యువకుడిని క్షేమంగా కిందికి దింపారు. యువకుడిని కిందికి దించేందుకు పోలీసుల తల ప్రాణం తోకకు వచ్చింది. అనంతరం కేసు నమోదు చేసి ఖాలీమొద్దిన్ ను తల్లిదండ్రులకు అప్పగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..