Telangana: మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు.. ఒకేసారి ఎంతంటే..?
తెలంగాణలోని మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయని సమాచారం. జూన్ 2 తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వం నుంచి రావొచ్చని తెలుస్తోంది. దీంతో మందుబాబులపై భారం పడనుంది. బీర్ల ధరలు కూడా పెరగనున్నాయని తెలుస్తోంది. అన్ని రకాల మద్యం ధరలు పెరగనున్నాయి.

తెలంగాణలోని మందుబాబులకు షాకింగ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. ఇప్పటికే ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకోగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ధరల పెంపుకు సంబంధించి ఇప్పటికే కమిటీ ప్రభుత్వానికి సిఫార్సులు చేసింది. దీంతో పాటు మద్యం తయారీ కంపెనీల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ధరలు పెంచక తప్పదని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో జూన్ 2 తర్వాత మద్యం ధరలు పెరగవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 10 నుంచి 15 శాతం వరకు ధరలు పెరగవచ్చని చెబుతున్నారు.
అన్ని రకాల మద్యం ధరలు పెంపు..?
తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం జూన్ 2న వస్తోంది. దీంతో ఆ తర్వాత మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. దాదాపు అన్ని రకాల మద్యం ధరలను పెంచేందుకు సిద్దమవుతోంది. జూన్ 2 తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన రావొచ్చని తెలుస్తోంది. మద్యం తయారీకి ఎక్కువ వ్యయం అవుతుందని, ధరలను పెంచాలని ప్రభుత్వానికి కంపెనీలు ఎప్పటినుంచో వినతులు అందిస్తున్నాయి. పెంచకపోతే తమకు ఆర్ధిక భారం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ద ప్రభావంతో సీసాల ధరలు పెరిగాయి. అంతేకాకుండా కమర్షియల్ గ్యాస్ ధరలు పెరగడంతో తయారీ ఖర్చు 15 నుంచి 20 శాతం వరకు పెరిగిందని కంపెనీలు చెబుతున్నాయి. వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు వెయ్యికిపైగా పెరిగాయి. దీంతో కంపెనీల ఒత్తిడి, కమిటీ సిఫార్సుల మేరకు మద్యం ధరల పెంపునకు రేవంత్ సర్కార్ మొగ్గు చూపింది.
పెరగనున్న అన్ని బ్రాండ్ల ధరలు
సాధారణ, మీడియం బ్రాండ్లతో పాటు ప్రీమియం ధరల బ్రాండ్ల ధరలను కూడా పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది. దీంతో పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడా ఆదాయం పెరగనుంది. అయితే మద్యం ధరలకు సంబంధించి గతంలో రేవంత్ సర్కార్ ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇతర రాష్ట్రాల్లోని మద్యం ధరలు, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను అంచనా వేసింది. దీని ఆధారంగా 25 నుంచి 30 శాతం వరకు పెంచాలని ప్రభుత్వానికి నివేదికలు ఇటీవల అందించింది. అయితే అంత మొత్తంలో పెంచితే మందుబాబుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశముంటుంది. దీంతో 15 శాతం వరకు పెంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. కాగా రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు మద్యం ధరలు పెంచలేదు. ఇప్పుడు తొలిసారి ధరలను పెంచేందుకు రెడీ అవుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి.
