Telangana Police Jobs 2022 Notification: నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 పోస్టులను భర్తీ చేయనున్నట్లు బుధవారం అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. జోనల్, జల్లాల స్థాయిలో వెంటనే నియామక ప్రక్రియ అమలవుతుందని సీఎం కేసీఆర్ (CM KCR) పేర్కొన్నారు. అయితే.. భర్తీల్లో పోలీసు శాఖకు సంబంధించిన పోస్టులు (Jobs 2022) కూడా ఉన్నాయి. ఈ తరుణంలో తెలంగాణ పోలీసు శాఖ కీలక ప్రకటన చేసింది. పోలీసు ఉద్యోగాల కోసం ప్రయత్నించే యువతకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రకటించారు. ఈ దిశగా ఏర్పాట్లు చేయాలని మహేందర్ రెడ్డి రాష్ట్రంలోని పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్లు, జిల్లాల పరిధిలో ప్రత్యేక శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయాలని డీజీపీ సూచించారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చి.. పోలీసు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే విధంగా వాళ్లను చైతన్యపర్చాలంటూ డీజీపీ సూచించారు. కమ్యూనిటీ ఎంపవర్‌మెంట్‌లో భాగంగా, స్కిల్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ సహాయంతో యువతను పోలీస్ ఫోర్స్‌లో చేరేలా ప్రోత్సహించడం కోసం.. అన్ని యూనిట్లలో ప్రీ-రిక్రూట్‌మెంట్ కోచింగ్ శిబిరాలను ప్రారంభించాలని ఆదేశించారు. 2014 నుంచి పోలీస్ శాఖలో 45,113 మందిని రిక్రూట్‌మెంట్ చేసి.. మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ పోలీసులు అత్యంత అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తున్నారంటూ డీజీపీ ట్విట్ చేశారు.
కాగా.. గత ఏడేళ్లుగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో యువతకు పోలీస్ అధికారులు ఉచిత శిక్షణను ఇస్తున్నారు. పేద, మధ్యతరగతికి చెందిన యువత ఈ శిక్షణా శిబిరాలను ఉపయోగించుకొని పోలీసు ఉద్యోగాలను సాధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనర్‌గా ఉన్న సమయంలో మహేందర్‌రెడ్డి ఈ శిక్షణా శిబిరాలు నిర్వహించారు. డీజీపీ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలోనూ ఈ విధానాన్ని అమలు చేస్తుండటం విశేషం.
Also Read: