Telangana Weather Alert: వారం రోజుల పాటు ఏకధాటిన కురిసిన భారీ వర్షాలతో తెలంగాణ రాష్ట్రంలోని నదులు, చెరువులు, ప్రాజెక్టులు నిండిపోయాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద నీరు ముంచెత్తడంతో.. రాష్ట్రంలో అనేక గ్రామాలు నీట మునిగాయి. వర్షాలు, వరదల బీభత్సంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అయితే ఇప్పుడిప్పుడే.. వర్షాలు, వరదలు తగ్గుముఖం పడుతున్నాయనుకుంటున్న వేళ.. మళ్ళీ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో రానున్న మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రెండు రోజుల క్రితం ఒరిస్సా తీరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. ఆ అల్పపీడనం నిన్న వాయువ్య బంగాళాఖాతంలోని ఒరిస్సా నుంచి పశ్చిమ బెంగాల్ వరకూ కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ సహా అనేక జిల్లాలో మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. రేపు అనేక జిల్లాలో భారీ వానలు పడే అవకాశం ఉందని .. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది.
మరోవైపు భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. వాతావరణం అనుకూలించకపోవడంతో.. సీఎం కేసీఆర్.. ఏరియల్ సర్వే ను విరమించుకుని.. బస్సు ద్వారానే భద్రాచలం చేరుకున్నారు. వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..