AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీఎస్‌ సివిల్ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌.. ఆ తర్వాతే చేపట్టాలంటూ ఆదేశాలు..

తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో తెలంగాణ సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌ వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు అడ్డంకి ఏర్పడింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Telangana: టీఎస్‌ సివిల్ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌.. ఆ తర్వాతే చేపట్టాలంటూ ఆదేశాలు..
Telangana High Court
Shaik Madar Saheb
|

Updated on: Oct 10, 2023 | 12:01 AM

Share

తెలంగాణ కానిస్టేబుల్ ఫలితాలను గత బుధవారం విడుదల చేసిన విషయం తెలిసిందే.. ఈ సమయంలో తెలంగాణ సివిల్‌ కానిస్టేబుల్‌ నియామకాలకు హైకోర్ట్‌ బ్రేక్‌ వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తెలంగాణలో సివిల్ కానిస్టేబుల్ కొత్త నియామకాలకు అడ్డంకి ఏర్పడింది. 4 ప్రశ్నలను తొలగించి మరోసారి మూల్యాంకనం చేయాలని, ఆ తర్వాత తాత్కాలిక ఎంపిక జాబితా ప్రకటించాలంటూ ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే, ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడాన్ని కానిస్టేబుల్ నియామక బోర్డును హైకోర్టు తప్పుబట్టింది. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించిన పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో తాము నష్టపోయామని పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. మెయిన్స్‌ పరీక్ష నుంచి 4 ప్రశ్నలు తొలగించి.. తిరిగి మూల్యాంకనం చేయాలని ఆదేశించింది. అభ్యర్థులందరికీ నాలుగు మార్కులు కలిపి ఫలితాలు వెల్లడించాలంటూ తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ (TSLPRB)కి ఆదేశించింది.

కాగా.. పోలీసు ఉద్యోగాల భర్తీ కోసం తెలంగాణ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ గతేడాది ఏప్రిల్ 25న నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే ఏడాది ఆగస్టు 30న పరీక్షను నిర్వహించింది. సివిల్ కానిస్టేబుల్‌కు సంబంధించి 4,965 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పరీక్షలు రాశారు. అయితే, ఇందులో 3 ప్రశ్నలను తెలుగులోకి అనువాదం చేయకపోవడంతో పాటు ఒక ప్రశ్న తప్పుగా ఇవ్వడంతో సమాధానాలు రాయలేకపోయామని పలువురు అభ్యర్థులు హైకోరట్లు దాఖలు చేసిన పిటిషన్లలలో పేర్కొన్నారు. ఇంటర్ వరకు చదువుకున్న అభ్యర్థులు.. ఇంగ్లీషులో ప్రశ్నలుండటంతో గందరగోళానికి గురై సమాధానం రాయలేక నష్టపోయారంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వివరించారు. అయితే, అవి సరిగానే ఉన్నట్లు పోలీసు నియామక మండలి తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. ఇంగ్లీషు పదాలను తెలుగులో అనువాదం చేసే అవకాశం ఉన్నా.. పరిగణలోకి తీసుకోకపోవడాన్ని కోర్టు తప్పుబట్టింది. 4 ప్రశ్నలను తొలగించి ఆ తర్వాత మూల్యాంకనం చేయాలని.. దాని తర్వాత నియామక ప్రక్రియ కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

కాగా.. సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను నియామక మండలి టీఎస్ఎల్పీఆర్బీ గత బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం అభ్యర్థుల పూర్తి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ క్రమంలో హైకోర్టు తీర్పుతో నియామక ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..