కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. రాష్ట్రాలకు కేంద్రం కోతలు, వాతలు పెట్టడం తప్ప ఇచ్చిందే ఏం లేదని హరీశ్ విమర్శించారు. సిద్ధిపేట జిల్లా దుబ్బాకలో శుక్రవారం నిర్వహించిన నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, దౌల్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, తొగుట మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన హరీశ్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ గా భాస్కర్ చారి, తొగుట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొమురయ్య, దౌల్తాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఇప్ప లక్ష్మి మంత్రి హరీశ్ రావు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభ సమావేశంలో మాట్లాడిన మంత్రి ఛైర్మన్లుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ మంత్రి హరీశ్ రావు.. ‘జై జవాన్-జై కిసాన్ అనే నానుడి లేకుండా.. ఓ వైపు రైతులకు గోస పెట్టి, మరోవైపు సైనికులకు కూడా అగ్నిపథ్‌తో దేశ యువతను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. విద్యుత్ మీటర్ల నిబంధన లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి ఏటా రూ. 6 వేల కోట్లు, రెండేళ్లలో రూ. 12 వేల కోట్లు ఎందుకు నిలిపివేశారో కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చట్టంలో విద్యుత్ మీటర్లు లేకపోతే రెండేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన 12వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలి. రూ. 400 గ్యాస్ సిలిండర్‌ను రూ. 1200 చేసిన ఘనత బీజేపీదే. బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాలకు కోతలు, వాతలు తప్ప ఇచ్చిందేమీ లేద’ని హరీష్ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.
ఇక టీఆర్‌ఎసీ ప్రభుత్వం అందిస్తోన్న సంక్షేమ పథకాల గురించి మంత్రి హరీశ్ రావు వివరిస్తూ.. ‘తెలంగాణ రాష్ట్రంలో 65 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కింద రైతుబంధు అందించాము. ఇందు కోసం 57 వేల 8 వందల 80 కోట్ల రూపాయలు ఖర్చుచేశాము. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల కింద రైతుభీమా సాయం అందించిన ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్. ఇప్పటికే 87 వేల మంది రైతుల కుటుంబాలకు రూ.4333 కోట్ల రూపాయలు రైతుభీమా సాయాన్ని అందించాము. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు.. ఇతర ఏ రాష్ట్రాలలోనైనా ఉన్నాయా.? రైతుబంధు, అమృత్ సరోవర్, హర్ ఘర్ కో జల్, మూగజీవాలకు అంబులెన్స్ 1962లను దేశమంతా అమలు చేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర బీజేపీ కాపీ కొడుతోంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు లేదు. కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలు అవుతుంది. దుబ్బాక నియోజకవర్గంలో 54 వేల మందికి నెల నెలా ఆసరా పింఛన్లు అందిస్తున్నాం. మరో 15 రోజులలో ఎన్నికల కమిషన్ ఆమోద ముద్ర వేయగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్-భారతీయ రాష్ట్ర సమితిగా మారనుంది’ అని చెప్పుకొచ్చారు.
ఇక ఈ కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘దేశ కష్టాల్లో ఉందని, దేశ ప్రజల సంక్షేమం కోసం దేశ పౌరుడిగా తన బాధ్యత నెరవేర్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు నేతృత్వంలో నిధుల కొరత లేకుండా దుబ్బాక నియోజకవర్గం అన్నీ రంగాలలో అభివృద్ధి చెందులోంది. దుబ్బాకను సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు ఆశీస్సులతో అన్నీ రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకెళతాం’ అని చెప్పుకొచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..