Telangana: తెలంగాణలో మోటార్‌ వెహికిల్ యాక్ట్‌ మరింత కఠినతరం.. ఈ రూల్స్ మస్ట్

|

Oct 08, 2024 | 6:20 PM

తెలంగాణలో మోటార్‌ వెహికిల్ యాక్ట్‌ మరింత కఠినతరం కాబోతోంది. కాలుష్య నియంత్రణతోపాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా కఠిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. వాహనదారుల ఇబ్బందులను తొలగించేందుకు.. పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న వాహన్‌ సారథి పాలసీని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

Telangana: తెలంగాణలో మోటార్‌ వెహికిల్ యాక్ట్‌ మరింత కఠినతరం.. ఈ రూల్స్ మస్ట్
Hyderabad Traffic Police
Follow us on

తెలంగాణ రవాణాశాఖలో పలు కీలక మార్పులు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు ట్రాన్స్‌పోర్ట్‌ మినిస్టర్‌ పొన్నం ప్రభాకర్‌. ప్రధానంగా.. వెహికిల్‌ స్క్రాప్‌ పాలసీ, వాహనాల ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్లు, వాహన్‌ సారథి పోర్టల్‌ అమలు, ట్రాఫిక్‌ రూల్స్‌ కఠినతరం చేయడం, అవగాహన కల్పించడం లాంటి అంశాలపై ఫోకస్‌ పెట్టినట్లు తెలిపారు. దానిలో భాగంగా.. దేశంలోని 28 రాష్ట్రాలు ఇప్పటికే అమలు చేస్తున్న భారత మోటారు వాహన చట్టంలోని వాహన్‌ సారిథి తెలంగాణలోనూ అమలు చేయబోతున్నామన్నారు. దీని ద్వారా వాహనదారులకు సంబంధించిన అంతరాష్ట్ర ఇబ్బందులకు చెక్‌ పడుతుందని చెప్పారు.

అలాగే.. వెహికల్‌ స్క్రాపింగ్‌ పాలసీ అమలుకు నిర్ణయించామన్నారు. ప్రైవేట్‌ వాహనాల వాలెంటరీ వెహికిల్ స్క్రాపింగ్‌ పాలసీ ద్వారా వాహనదారులకు సర్టిఫికెట్లు ఇచ్చి.. కొత్తగా వాహనాలు కొనుగోలు చేస్తే లైఫ్‌ టాక్స్‌లో రాయితీలు ఇస్తామన్నారు. బైక్స్ తుక్కుగా మారిస్తే..  లైఫ్ ట్యాక్స్‌లో కనీసం రూ.వెయ్యి నుంచి రూ.ఆరేడు వేల వరకు, ఫోర్ వీలర్ వాహనాలకు అయితే కనీసం రూ.15 వేలు, గరిష్ఠంగా రూ.50 వేల వరకు డిస్కౌంట్ ప్రతిపాదించినట్లు తెలిసింది. కొత్తగా కొనుగోలు చేసే వెహికల్ విలువ ఆధారంగా ఈ డిస్కౌంట్ మొత్తం ఉంటుందని రవాణాశాఖ అధికారులు తెలిపారు.  కర్ణాటక, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లోని పాలసీలను అధ్యయనం చేసి.. తెలంగాణలోనూ అమలు చేసేందుకు కొత్తగా జీవో తీసుకొచ్చామని తెలిపారు.

ఇక.. వాహన కాలుష్య నియంత్రణ, ఫిట్‌నెస్‌కు సంబంధించి కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు వెల్లడించారు మంత్రి పొన్నం ప్రభాకర్‌. వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ కోసం ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ స్టేషన్లు నిర్మిస్తామన్నారు. ప్రస్తుతం ఆర్టీవో ఆఫీసుల్లో వాహనాల ఫిట్‌నెస్‌ టెస్టింగ్‌ సరిగ్గా జరగడం లేదని.. ఇకపై ఆటోమేటిక్‌ టెస్టింగ్‌ సెంటర్లలో వాహనాల ఫిట్‌నెస్‌ సర్టిఫికేట్లు ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మరోవైపు.. తెలంగాణలో రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవింగ్‌పై, డ్రైవింగ్‌ రూల్స్‌పై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తామని.. రూల్స్‌ అతిక్రమిస్తే డ్రైవింగ్‌ లైసెన్సులు శాశ్వతంగా రద్దు చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.