AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై..

ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ఆలస్యం, కాలేజీ యాజమాన్యాల బంద్‌ల నేపథ్యంలో ప్రభుత్వం సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 16 మంది సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు దక్కింది. కమిటీ 3 నెలల్లో నివేదిక ఇవ్వనుంది.

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై..
Fee Reimbursement Committee
Krishna S
|

Updated on: Nov 04, 2025 | 8:33 PM

Share

ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశానికి సంబంధించిన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతుండటం, కాలేజీ యాజమాన్యాలు పదే పదే ఆందోళనకు దిగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో సమూల సంస్కరణలు తీసుకురావడంపై అధ్యయనం చేయడానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

గత కొంతకాలంగా ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తోంది. దీనివల్ల ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య దూరం పెరుగుతోంది. సమయానికి నగదు అందకపోవడంతో యాజమాన్యాలు తరచుగా బంద్‌లకు పిలుపునిస్తున్నాయి. చర్చల తర్వాత ప్రభుత్వం వాయిదాల రూపంలో చెల్లింపులు చేస్తున్నప్పటికీ, ఈ జాప్యం పునరావృతమవుతోంది. ఈ తరహా ఘటనలు విద్యార్థులపై, విద్యా వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కమిటీలో ఎవరంటే..?

ఈ కమిటీలో స్పెషల్ చీఫ్ సెక్రటరీతో సహా మొత్తం 16 మంది సభ్యులు ఉంటారు. ప్రముఖ ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరాంలకు ఈ కమిటీలో చోటు కల్పించారు.కాలేజీ యాజమాన్యాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడానికి వారి నుంచి ముగ్గురు ప్రతినిధులకు కమిటీలో స్థానం కల్పించారు.

కమిటీ చేయాల్సిన పనులు

ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కమిటీకి నిర్దిష్టంగా ఈ లక్ష్యాలను అప్పగించింది..

  • ప్రస్తుత విధానాన్ని పూర్తిగా అధ్యయనం చేసి దానిపై ప్రభుత్వానికి తగిన కీలక సూచనలు అందించాలి.
  • ప్రత్యేక ట్రస్ట్ పరిశీలన: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల కోసం ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేయవచ్చా? దాని
  • సాధ్యాసాధ్యాలు ఏమిటి? అనే దానిపై పరిశీలన చేయాలి.
  • విద్యా సంస్థలు, కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వానికి అందించిన సూచనలపై కూడా అధ్యయనం చేయాలి.

నివేదిక గడువు

ఈ కమిటీ తన సమగ్ర నివేదికను మూడు నెలల్లోపు ప్రభుత్వానికి అందజేయాలని జీవోలో స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగానే తెలంగాణ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల విషయంలో ఒక శాశ్వత విధానాన్ని రూపొందించే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.