AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ర్యాపిడో, ఉబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైడింగ్ యాప్.. అతి తక్కువ ధరల్లో ప్రయాణం..

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ క్యాబ్ యాప్‌లకు పోటీగా ప్రభుత్వం తరపున ఒక ప్రత్యేక యాప్ త్వరలో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వయంగా ప్రకటించారు. సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈ ప్రకటన చేశారు.

Telangana: ర్యాపిడో, ఉబర్ తరహాలోనే తెలంగాణ ప్రభుత్వం నుంచి రైడింగ్ యాప్.. అతి తక్కువ ధరల్లో ప్రయాణం..
Telangana
Venkatrao Lella
|

Updated on: Sep 09, 2026 | 6:58 AM

Share

తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు, ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది. ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ప్రధాన నగరాల్లో ర్యాపిడో, ఉబర్, ఓలా లాంటి బైక్, ఆటో క్యాబ్ సర్వీసులు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ ప్రైవేట్ యాప్స్‌లో ధరలు అధికంగా ఉండటంతో పాటు రిజిస్టర్ చేసుకుని సేవలు అందించేవారి నుంచి అధిక కమీషన్లు వసూలు చేస్తున్నారు. దీంతో ప్రజలతో పాటు ఆటో డ్రైవర్లకు కూడా నష్టం జరుగుతోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తక్కువ ధరకే ప్రజలకు క్యాబ్ సర్వీసులు అందించడంతో పాటు కమీషన్ల భారం నుంచి ఆటో డ్రైవర్లకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వమే సొంతగా ఒక యాప్ తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. త్వరలో ఈ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

ఓలా, ఉబర్, ర్యాపిడో లాంటి ప్రైవేట్ అగ్రిగేటర్ల యాప్‌ల తరహాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక రైడ్ హేలింగ్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సచివాలయంలో ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో పొన్నం ప్రభాకర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలపై చర్చించారు. డ్రైవర్లతో పాటు ఇతర కార్మికుల భద్రత కోసం ఇన్స్యూరెన్స్ పాలసీని అమలు చేయడంపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని అన్నారు. ఆటో కార్మికుల సంక్షేమం, ఉపాధి అవకాశాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ప్రభుత్వం తరపున ప్రత్యేక రైడ్ హేలింగ్ యాప్ తీసుకురానున్నట్లు వెల్లడించారు. ఈ యాప్ ద్వారా అత్యంత తక్కువ ధరల్లో ప్రజలకు క్యాబ్ సర్వీసులు అందిస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లకు కమిషన్ల భారం కూడా తగ్గి వారికి ప్రయోజనం జరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కూడా దృష్టి పెట్టినట్లు తెలిపారు.

సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కేబినెట్‌లో చర్చించి అనంతరం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. 2012 తర్వాత ఆటో ఛార్జీలను పెంచలేదని, ప్రస్తుతం పెంచేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు. ఆటో కార్మికుల సంఘాలు, రవాణశాఖ అధికారులతో ఛార్జీల పెంపుపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎంత పెంచాలనే దానిపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి త్వరలో నివేదిక సమర్పించనుందని, ఆ నివేదిక పరిశీలించాక ఎంత పెంచాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టనున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి ఆలోచన ప్రభుత్వానికి లేదని పేర్కొన్నారు.

Follow Us