AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ICC ODI Rankings: గిల్ కుర్చీకి ఎసరు పెట్టిన కోహ్లీ.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల జోరు

ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) విడుదల చేసిన తాజా వన్డే ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రెండో స్థానానికి చేరి అగ్రస్థానంలో ఉన్న శుభ్‌మన్ గిల్‌కు తీవ్ర పోటీనిస్తున్నాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టాప్ 5 బౌలర్ల జాబితాలోకి ప్రవేశించాడు. రోహిత్ శర్మ నాలుగో స్థానంలో నిలిచాడు.

ICC ODI Rankings: గిల్ కుర్చీకి ఎసరు పెట్టిన కోహ్లీ.. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్‌లో భారత క్రికెటర్ల జోరు
Indian Team
Rakesh
|

Updated on: Sep 30, 2026 | 3:49 PM

Share

ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పురుషుల వన్డే ప్లేయర్ల తాజా ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. తిరువనంతపురంలో వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో అద్భుత సెంచరీతో చెలరేగిన టీమిండియా దిగ్గజం విరాట్ కోహ్లీ ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని రెండో స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం కోహ్లీ ఖాతాలో 796 రేటింగ్ పాయింట్లు ఉండగా, 816 పాయింట్లతో శుభ్‌మన్ గిల్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరి మధ్య కేవలం 20 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉండటంతో గిల్ అగ్రస్థానానికి ముప్పు ఏర్పడింది. తొలి వన్డేలో కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులు సాధించగా, గిల్ 108 బంతుల్లో 110 పరుగులు చేశాడు.

న్యూజిలాండ్‌కు చెందిన డెరిల్ మిచెల్ 794 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ 719 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్ మూడు స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకోగా, ఇంగ్లాండ్ హిట్టర్ హ్యారీ బ్రూక్ 11వ స్థానంలో నిలిచాడు. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ తెంబా బావుమా ఆస్ట్రేలియాపై సెంచరీ బాదడంతో ఏకంగా 10 స్థానాలు ఎగబాకి 32వ స్థానానికి చేరుకున్నాడు. మాథ్యూ బ్రీట్జ్కే 21వ స్థానానికి, డేవిడ్ మిల్లర్ 41వ స్థానానికి చేరుకున్నారు.

బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే భారత చైనామ్యాన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఏకంగా నాలుగు స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. వెస్టిండీస్‌పై 40 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవడం ఆయనకు కలిసివచ్చింది. అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (714 పాయింట్లు) మొదటి స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన అబ్రార్ అహ్మద్ రెండో స్థానంలో ఉన్నారు. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ మూడో స్థానానికి చేరుకోగా, ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్ 10వ స్థానానికి ఎగబాకాడు.

ఆల్‌రౌండర్ల విభాగంలో జింబాబ్వే స్టార్ ప్లేయర్ సికందర్ రజా 321 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియాపై 94 పరుగులు చేసి 3 వికెట్లు తీసిన సౌత్ ఆఫ్రికా ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్ మూడు స్థానాలు మెరుగుపరుచుకుని 15వ స్థానానికి చేరుకున్నాడు. రాబోయే మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు, బౌలర్లు ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే ర్యాంకింగ్స్‌లో మరిన్ని సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us