పండగల వేళ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. హైటెక్ సిటీలో 10 రైళ్లకు తాత్కాలిక హాల్ట్.. పూర్తి వివరాలు
దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక సౌకర్యం కల్పించింది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలిక హాల్ట్ ఇచ్చింది. నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31, 2027 వరకు ఈ స్టాపేజ్‌లు అందుబాటులో ఉంటాయి.

హైదరాబాద్: పండుగల సీజన్ మొదలవుతోంది.. వరుసగా.. దసరా, దీపావళి రాబోతున్నాయి.. ఈ తరుణంలో రాబోయే పండగల సీజన్‌లో రైల్వే ప్రయాణికుల తిరుగుప్రయాణ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్, నాంపల్లి (హైదరాబాద్) ప్రధాన రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల భారాన్ని తగ్గించేందుకు, ఐటీ కారిడార్‌లోని ప్రయాణికుల సౌకర్యార్థం హైటెక్ సిటీ (Hi-Tech City) రైల్వే స్టేషన్‌లో 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లకు తాత్కాలికంగా ఆగడానికి అనుమతి ఇచ్చింది.
పండుగల సమయంలో ముఖ్యంగా సికింద్రాబాద్, హైదరాబాద్ స్టేషన్లకు వెళ్లేందుకు నగరంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో హైటెక్ సిటీ స్టేషన్‌లో అదనపు స్టాపేజ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ప్రయాణికుల రాకపోకలను సులభతరం చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది.. ఈ తాత్కాలిక హాల్ట్‌లతో మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి ఎంతో ప్రయోజనం కలగనుంది.
ఉచితంగా బోర్డింగ్ పాయింట్ మార్పు:
ఇప్పటికే సికింద్రాబాద్ లేదా హైదరాబాద్ స్టేషన్ల నుంచి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఉచితంగా తమ ‘బోర్డింగ్ పాయింట్’ను హైటెక్ సిటీకి మార్చుకోవచ్చని రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఏయే రైళ్లకు స్టాపేజ్ కల్పించారంటే?
సికింద్రాబాద్–రాజ్‌కోట్, రాజ్‌కోట్–సికింద్రాబాద్, సికింద్రాబాద్–పోరుబందర్, పోరుబందర్–సికింద్రాబాద్, తిరుపతి-సికింద్రాబాద్, సికింద్రాబాద్ -తిరుపతి, హైదరాబాద్-సీఎస్టీ ముంబై, సీఎస్టీ ముంబై – హైదరాబాద్, పుణె-హైదరాబాద్, హైదరాబాద్-పుణె మార్గాల్లో నడిచే రైళ్లకు కూడా హైటెక్ సిటీలో తాత్కాలిక స్టాపేజ్ కల్పించారు. ఈ రైళ్లు నవంబర్ 1, 2026 నుంచి జనవరి 31 2027 వరకు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఆగనున్నాయి.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్లో ఆగే రైళ్ల వివరాలు..
రైలు నంబరు 22718 సికింద్రాబాద్–రాజ్‌కోట్ మధ్యాహ్నం 3.30 గంటలకు, 22717 రాజ్‌కోట్–సికింద్రాబాద్ ఉదయం 6.19 గంటలకు హైటెక్ సిటీకి చేరుకోనున్నాయి.
20967 సికింద్రాబాద్–పోరుబందర్ రైలు మధ్యాహ్నం 3.30 గంటలకు, 20968 పోరుబందర్–సికింద్రాబాద్ రైలు ఉదయం 6.19 గంటలకు ఇక్కడ ఆగనున్నాయి.
తిరుపతి–సికింద్రాబాద్ రైలు నంబరు 12731 ఉదయం 6.08 గంటలకు, సికింద్రాబాద్–తిరుపతి రైలు నంబరు 12732 తెల్లవారుజామున 4.35 గంటలకు హైటెక్ సిటీ స్టేషన్‌కు చేరుకుంటాయి.
హైదరాబాద్–సీఎస్టీ ముంబై రైలు నంబరు 12702 రాత్రి 3.17 గంటలకు, సీఎస్టీ ముంబై–హైదరాబాద్ రైలు నంబరు 12701 ఉదయం 11.07 గంటలకు హైటెక్ సిటీలో ఆగుతాయి.
పుణె–హైదరాబాద్ రైలు నంబరు 12025 మధ్యాహ్నం 1.33 గంటలకు, హైదరాబాద్–పుణె రైలు నంబరు 12026 మధ్యాహ్నం 3 గంటలకు హైటెక్ సిటీ స్టేషన్‌లో నిలవనున్నాయి.
దసరా, దీపావళి పండగల వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఈ తాత్కాలిక సదుపాయం ఎంతో ఊరట నివ్వనుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
