ఎర్ర ఇటుకలు vs తెల్ల ఇటుకలు.. మీ ఇంటి నిర్మాణానికి ఏది బెస్ట్? ఈ నిజాలు తప్పక తెలుసుకోండి..
Red Bricks vs AAC Blocks: జీవితకాల కష్టార్జితంతో కట్టుకునే సొంతింటి కల కలకాలం నిలవాలంటే పునాదులే కాదు, గోడలూ పటిష్టంగా ఉండాలి. అయితే ఇల్లు కట్టే క్రమంలో ప్రతి ఒక్కరినీ వేధించే బిగ్ డౌట్.. తరతరాలుగా వస్తున్న ఎర్ర ఇటుకలు మేలా? లేక మార్కెట్‌ను శాసిస్తున్న ఆధునిక తెల్ల ఇటుకలు ఉత్తమమా? బలం, మన్నిక, ఖర్చుల విషయంలో నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం

సొంతిల్లు అనేది ప్రతిఒక్కరి జీవితకల. అందుకోసం ఎంతో శ్రమిస్తుంటారు. ఇక సొంతిల్లు కట్టుకోవాలనే ఆలోచన రాగానే ప్రతి ఒక్కరి మదిలో మెదిలే మొదటి ప్రశ్న.. గోడల నిర్మాణం కోసం సంప్రదాయ ఎర్ర ఇటుకలు వాడాలా లేక ఆధునిక తెల్ల ఇటుకలు ఎంచుకోవాలా?.. ఈ విషయంలో చాలా మంది తికమకపడుతూ తెగ ఆలోచిస్తుంటారు. ఎర్ర ఇటుకలను సాంప్రదాయ బంకమట్టితో చేసి బట్టీలలో అధిక ఉష్ణోగ్రత వద్ద కాలుస్తారు. ఇవి బరువు ఎక్కువగా ఉండి, అద్భుతమైన నిర్మాణ బలాన్ని ఇస్తాయి. మరోవైపు ఫ్లై యాష్ ఇటుకలను థర్మల్ పవర్ ప్లాంట్ల నుండి వచ్చే బూడిద, సిమెంట్, సున్నం, జిప్సం మిశ్రమాన్ని అత్యాధునిక హైడ్రాలిక్ యంత్రాలతో అధిక పీడనం వద్ద నొక్కి తయారు చేస్తారు. వీటిని బట్టీలలో కాల్చకుండా నీటితో క్యూరింగ్ చేస్తారు. దీనివల్ల ప్రతి ఇటుక ఒకే రకమైన పరిమాణంతో, పదునైన అంచులతో ఉంటుంది.
సిమెంట్, ఇసుక ఆదా..
నిర్మాణ నాణ్యత.. ఖర్చుల విషయానికి వస్తే తెల్ల ఇటుకలు ముందంజలో ఉంటాయి. మెషిన్ ద్వారా తయారవడం వల్ల వీటి ఉపరితలం సమానంగా ఉండి, గోడల ప్లాస్టరింగ్ కోసం సిమెంట్, ఇసుక వాడకం గణనీయంగా తగ్గుతుంది. అంతేకాకుండా ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఇవి నీటిని చాలా తక్కువగా పీల్చుకుంటాయి కాబట్టి తేమ, లవణాలు వచ్చే అవకాశం తక్కువ. ఒక్కో ఇటుక ధర పరంగా కూడా ఎర్ర ఇటుకలతో పోలిస్తే ఫ్లై యాష్ ఇటుకలు చౌకగా లభిస్తుండటంతో మొత్తం నిర్మాణ వ్యయం తగ్గుతుంది.
పర్యావరణానికి..
పర్యావరణ కోణంలో చూసినా ఫ్లై యాష్ ఇటుకలు ఎంతో మేలైనవి. ఎర్ర ఇటుకల కోసం వ్యవసాయ యోగ్యమైన మట్టిని తవ్వడం, బట్టీల వల్ల వాయు కాలుష్యం కలగడం వంటి సమస్యలు ఉంటాయి. అదే విద్యుత్ కేంద్రాల పారిశ్రామిక వ్యర్థమైన బూడిదతో తయారయ్యే ఫ్లై యాష్ ఇటుకలు పర్యావరణహితమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి.
ఏది బెస్ట్..?
నిపుణుల సలహా ప్రకారం.. పిల్లర్లు, బీమ్‌లతో కట్టే ఆధునిక ఫ్రేమ్డ్ స్ట్రక్చర్ ఇళ్లకు, అపార్ట్‌మెంట్లకు ఫ్లై యాష్ ఇటుకలు ఆర్థికంగా, నాణ్యత పరంగా అద్భుతంగా సరిపోతాయి. పిల్లర్లు లేకుండా కేవలం గోడలపైనే స్లాబ్ భారం పడే సంప్రదాయ చిన్న ఇళ్లకు లేదా ఆర్కిటెక్చరల్ లుక్ కోసం ఎర్ర ఇటుకలను ఎంచుకోవచ్చు. నాణ్యమైన ఫ్లై యాష్ ఇటుకలను ఎంపిక చేసుకుంటే తక్కువ బడ్జెట్‌తోనే కలకాలం నిలిచే పటిష్టమైన ఇంటిని నిర్మించుకోవచ్చు.
