Telangana Govt: కరోనా సంక్షోభం వేళ ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అధిక ఫీజుల వసూలూ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ నేపథ్యంలోనే 2021-22 విద్యా సంవత్సరానికి పాఠశాల ఫీజుల నియంత్రణకు సంబంధించి తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 75ని జారీ చేసింది. 2021-22 విద్యా సంవత్సరంలో ఎటువంటి రుసుమును పెంచకూడదని ఆ జీవోలో స్పష్టం చేసింది. స్టేట్ బోర్డ్, సిబిఎస్ఇ, ఐసిఎస్ ఇతర అంతర్జాతీయ బోర్డులకు అనుబంధంగా ఉన్న అన్ని ప్రైవేట్ అన్‌ఎయిడెడ్ గుర్తింపు పొందిన పాఠశాలలకు ఈ నిబంధనలు వర్తిస్తాయని తెలంగాణ గవర్నమెంట్ ఆ జీవోలో తేల్చి చెప్పింది. తదుపరి ఆర్డర్లు వచ్చేవరకు నెలవారీ ప్రాతిపదికన ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలంది.
కాదని ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించి అధిక ఫీజులు వసూలు చేసినట్లయితే పాఠశాల గుర్తింపు రద్దు చేయడం జరుగుతుందని ప్రభుత్వం కరాఖండిగా తేల్చి చెప్పింది. ఇక ఇతర బోర్డులతో అనుబంధం కోసం ఇప్పటికే మంజూరు చేసిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వం తెలిపింది. నిబంధనల ప్రకారం పాఠశాల నిర్వహణపై తగిన చర్యలను ప్రారంభిస్తుందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన పాఠశాలలపై స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, తెలంగాణ, హైదరాబాద్ ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ప్రభుత్వ విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తెలిపారు.
Also read: