Telangana: పెన్షన్ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్‌.. డిజిటల్‌ ఆడిట్‌ దిశగా అడుగులు!

రాష్ట్రంలోని పెన్షన్‌ పంపిణీ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్‌ పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం తరహాలో చేయూత పెన్షన్లపై సామాజిక తనిఖీలు నిర్వహించాలని యోచిస్తోంది. పెన్షన్ పంపిణీ వ్యవస్థలో పారదర్శకత సాధించడం, అక్రమాలను అరికట్టడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందిస్తున్నటు సమాచారం.

Telangana: పెన్షన్ అవకతవకలపై ప్రభుత్వం ఫోకస్‌.. డిజిటల్‌ ఆడిట్‌ దిశగా అడుగులు!
Telangana Pension Scheme Update

Edited By:

Updated on: Jun 20, 2025 | 7:50 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందిస్తున్న చేయూత, ఆసర పెన్షన్‌ల పంపిణీలో ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని లబ్ధిదారుల నుంచి ఫిర్యాదులు రావడంతో.. ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఉపాధి హామీ పథకం తరహాలో ఇప్పుడు చేయూత పెన్షన్ల పంపిణీపై కూడా సామాజిక తనిఖీలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 44.20 లక్షల మందికిపైగా ప్రజలు చేయూత పెన్షన్లు పొందుతున్నారు. వీరిలో వృద్ధులు 16.44 లక్షలు, వితంతువులు 15.85 లక్షలు, దివ్యాంగులు 5.16 లక్షలు, ఒంటరి మహిళలు 1.43 లక్షలు, గీత కార్మికులు 67 వేల మందికిపైగా ఉన్నారు. అలాగే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, బీడీ టేకెదారులూ ఈ లబ్ధిదారుల జాబితాలో ఉన్నారు. ప్రస్తుతం సాధారణ పెన్షన్ రూ.2,016 కాగా, దివ్యాంగులకు రూ.4,016 చొప్పున మంజూరవుతోంది. అయితే ప్రభుత్వం మంజూరు చేసిన పెన్షన్ల పంపిణీలో అవకతవకలు జరుగుతున్నట్టు ప్రభుత్వానికి తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో పెన్షన్ల విధానంలో అవకతవకలను నివారించి, పారదర్శకతను పాటించేందుకు సామాజిక తనిఖీలు చేపట్టే విషయమై ప్రభుత్వం దృష్టి సారించింది. జాతీయ ఉపాధి హామీ పథకంలో నిర్వహిస్తున్నట్లుగా, చేయూత పెన్షన్లపై కూడా సామాజిక తనిఖీలు చేయాలన్న ప్రణాళిక కొనసాగుతోంది. ఈ తనిఖీల ద్వారా అక్రమాలను గుర్తించి, బాధ్యులపై చర్యలు తీసుకోవడమే ముఖ్య ఉద్దేశ్యం. నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు జరిగితే, తక్షణమే నివేదికలు సమర్పించి నష్టాన్ని రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. పరిశీలనలు ప్రారంభించే ముందు మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులకు సదరు విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. తద్వారా వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయడం, వాస్తవ లబ్ధిదారులకు ప్రభుత్వం సేవలు అందించనుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..