Telangana: మోటారు వాల్వును పరిశీలించడానికి భీమానదిలోకి వెళ్లిన రైతు.. క్షణాల వ్యవధిలో
నారాయణపేట జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగుచూసింది. భీమా నదిలోకి దిగిన రైతు తిప్పన్నను మొసలి లాక్కెళ్లింది. కృష్ణ మండలం కుసుమూర్తి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గజ ఈతగాళ్లు, పడవల ద్వారా తిప్పన్న కోసం గాలింపు జరుగుతోంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి..

భీమా నది సమీప రైతులారా.. మీరు అటు వైపు వెళ్లకండి. అక్కడ మొసళ్లున్నాయి.. అవును.. తిప్పన్న అనే రైతును నీటిలోకి లాక్కెళ్లింది మొసలి. నీటిలో ఏర్పాటు చేసుకున్న మోటార్ ఫుట్ వాల్‌ను సరిచేసుకునేందుకు అందులోకి దిగిన రైతు కనిపించకుండా పోయాడు. ఈ ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.
నది సమీపంలో ఉన్న తన పొలానికి సాగునీటి కోసం మోటారు ఏర్పాటు చేసుకున్నాడు తిప్పన్న. మోటారుకు మరమ్మతు చేసే క్రమంలో భీమా నదిలోకి దిగాడు. తిప్పన్నపై హఠాత్తుగా దాడి చేసిన మొసలి నీటిలోకి లాక్కెళ్లినట్లు అక్కడే ఉన్న మరో రైతు శివప్పగౌడ తెలిపాడు. స్పాట్‌కి చేరుకున్న పోలీసులు స్థానిక పడవలు, గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు తిప్పన్నకు సంబంధించి ఎలాంటి ఆచూకి చిక్కలేదు.
ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు తమ సాగునీటి అవసరాల కోసం నదిలో మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు. మొసలి దాడితో మిగతా రైతులు కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
