AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Conclave: కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ విఫల రాజకీయ నేత.. ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు!

తమ పార్టీ ఏ ఒక్క మతానికి పరిమితం కాదన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ. హిందూవులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మేము అనలేదన్నారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్.. కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శించారు.

TV9 Conclave: కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ విఫల రాజకీయ నేత.. ఎంపీ అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు!
Mp Asaduddin Owaisi
Balaraju Goud
|

Updated on: Nov 23, 2023 | 4:29 PM

Share

తమ పార్టీ ఏ ఒక్క మతానికి పరిమితం కాదన్నారు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) అధినేత, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఒవైసీ. హిందూవులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మేము అనలేదన్నారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్.. కాంగ్రెస్, బీజేపీల తీరుపై విమర్శించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీని చిత్తుగా ఓడిస్తామన్నారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యక్తి, టీకాంగ్రెస్‌ రిమోట్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ చేతిలో ఉందన్నారు.

మతపరమైన అల్లర్లను ఎంఐఎం పార్టీ ఎప్పుడు ప్రొత్సహించలేదన్నారు అసద్. మతసామరస్యానికి కట్టుబడి ఉన్నామన్నారు. గత తొమ్మిదిన్నరేళ్లలో హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారి కూడా అల్లర్లు జరగలేదని అసద్ గుర్తు చేశారు. ఇటీవల గణేష్ నిమజ్జనం సందర్బంగా ముస్లింలు సమ్యమనం పాటించారని, ఇందుకు కోసం ఏకంగా మిలాదున్ నబీ ర్యాలీనే వాయిదా వేసుకున్నామన్నారు అసదుద్దీన్.

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. రాహుల్ గాంధీ విమర్శలు చేసే ముందు వినడం నేర్చుకోవాలని సూచించారు. రాహుల్ గాంధీ ఏం మాట్లాడినా దానికి సమాధానాలు చెబుతామన్నారు అసద్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అజారుద్దీన్ మంచి క్రికెటరే.. కానీ, రాజకీయాల్లో అసమర్థుడని విమర్శించారు. కేటీఆర్‌ ఆయనకు హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బాధ్యతలు అప్పగిస్తే దాని స్థాయి దిగజార్చారు. ఎన్నికల్లో ప్రత్యర్థులు ఇద్దరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారైతే తప్పేంటి? అసమర్థ నేత కాబట్టి ఆయనపై బలమైన మజ్లిస్‌ అభ్యర్థిని రంగంలోకి దింపామన్నారు. బీజేపీ నేతలు మమ్మల్ని విమర్శించేందుకే ప్రాధాన్యమిస్తున్నారు తప్పా.. జనం కోసం ఏం చేస్తారో చెప్పడం లేదన్నారు. మతపరమైన వ్యాఖ్యలతో రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాందీ లాంటి నేతల సర్టిఫికెట్లు మాకు అవసరం లేదన్నారు అసదుద్దీన్. బీజేపీ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి.. త్వరలో బుల్డోజర్ సర్కార్ తీసుకొస్తానంటారు. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ మదర్సాలు మూసేస్తామంటారు.. వీరి వ్యాఖ్యలు చూస్తుంటే దేశంలో అంతర్యుద్ధం జరుగుతుందా? ఎన్నికలు జరుగుతున్నాయా? అన్న అనుమానం కలుగుతుందన్నారు.

హైదరాబాద్ పాతబస్తీ అభివృద్దిపై విపక్షాల విమర్శలను అసద్ తప్పుబట్టారు. హైదరాబాద్ నియోజకవర్గం పరిధిలో ఎస్‌ఆర్‌డీపీ నిధులతో రోడ్ల విస్తరణ, నాళాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. లోక్‌సభ స్థానంలోని ప్రతీ నియోజకవర్గంలో రూ.250కోట్లతో అభివృద్ది పనులు చేశామన్నారు. ప్రతీ నియోజకవర్గంలో సంక్షేమ కార్యక్రమాల అమలు జరగుతుందన్నారు అసద్. ముస్లిం సంక్షేమానికి ఎంఐఎం పార్టీ కట్టుబడి ఉందన్నారు అసద్.

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న 4 శాతం రిజర్వేషన్లు మత ప్రాతిపదికన చేసినవి కావు. ముస్లిం సామాజిక వర్గంలో ఆర్థికంగా, విద్యాపరంగా వెనకబడిన వారికి మాత్రమే అమలు చేస్తున్నారు. అదీ పీఎస్‌ కృష్ణన్, మండల్‌ కమిషన్‌ రిపోర్టు ప్రకారం సుప్రీంకోర్టు ఆదేశాలతో రిజర్వేషన్‌ అమలవుతోందన్నారు. ఆర్టికల్ 15 ప్రకారమే ముస్లింలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు.

అయితే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అభివృద్దిని పట్టించుకోవడం లేదన్న అసదుద్దీన్.. బీజేపీకి చెప్పుకోవడానికి ఏమీలేదన్నారు. మోదీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకివ్వడం లేదని అసద్ ప్రశ్నించారు. ప్రజా వ్యతిరేకత నుంచి కాపాడుకునేందుకు రామాలయంలాంటి అంశాలు లేవనెత్తుతున్నారన్నారు విమర్శించారు అసద్‌. ఎంఐఎంను బీజేపీతో సరిపోల్చడమేంటి? అని ఆయన ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతుందని జోస్యం చెప్పారు అసదుద్దీన్. కేసీఆర్‌ సొంతంగా మూడోసారి ముఖ్యమంత్రి అవుతారన్నారు. తెలంగాణ ప్రజలు మంచి నిర్ణయం తీసుకుంటారని అశాభావం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో రాష్ట్రంలో శాంతి భద్రతలు, అభివృద్ది మెరుగుపడ్డాయన్నారు. రెండు జాతీయ పార్టీలున్న రాష్ట్రం నాశనం అవుతుందన్న అసద్.. ప్రాంతీయ పార్టీ రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందన్నారు. రాజస్థాన్‌లో కేవలం మైనార్టీలకు కేవలం రూ.290కోట్ల బడ్జెట్ కేటాయిస్తే.. ఒక తెలంగాణలో మాత్రమే మైనార్టీలకు రూ.2,200 కోట్ల బడ్జెట్ నిధులు కేటాయించినట్లు గుర్తు చేశారు. జైపూర్ ఎక్స్‌ప్రెస్‌ కాల్పుల్లో చనిపోయిన హైదరాబాదీకి ఎక్స్‌గ్రేషియా, అదే ప్రమాదంలో చనిపోయిన రాజస్థానీ ముస్లింకి ఎక్స్‌గ్రేషియా ఇంత వరకు ఇవ్వలేదన్నారు.

రాజకీయాలతో పాటు హైదరాబాద్ అభివృద్దిలో ఎంఐఎం కీలక పాత్ర పోషిస్తోందన్నారు అసద్. నాంపల్లిలో రూ.80కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి ఉందని రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలకు చెందిన రోగులకు సేవలందుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో పోటీ చేయడానికి మేం ఎవర్నీ అడ్డుకోలేదన్న అసద్. తనపై రాహుల్ గాంధీ సైతం పోటీ చేయాలని కోరారు. వయనాడు కాకుండా రాహుల్‌ గాందీ హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారు అసదుద్దీన్. నాంపల్లి, నిజామాబాద్, కరీంనగర్‌లో బీజేపీ కోసం కాంగ్రెస్ పనిచేస్తోందని ధ్వజమెత్తారు. ముస్లిం సంక్షేమానికి కేటాయించాల్సిన రూ.625కోట్ల హజ్‌ సబ్సిడీని.. ఎయిరిండియాకు ఇస్తున్నారని అసర్ ఆరోపించారు. ఈ డబ్బుని ముస్లిం అమ్మాయిలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.

చాంద్రాయగుట్ట ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సమర్థించారు. సమయానికి ముందే వెళ్ళిపోవాలనడం సరికాదన్నారు. ఎన్నికల సంఘం కెమెరాలో స్పష్టం ఉందని, దీనిపై ఈసీ చర్యలు తీసుకోవాలని అసద్ డిమాండ్‌ చేశారు. తన నియోజకవర్గంలో అక్బరుద్దీన్ 17,000 మందికి విద్యనందిస్తున్నారని గుర్తు చేశారు. అక్బర్ ప్రచారంలో 5 నిమిషాల ముందే ఇన్‌స్పెక్టర్ ఒత్తిడి తెచ్చారు. ఆ ఇన్‌స్పెక్టర్ ప్రవర్తనపై మా దగ్గర వీడియోలున్నాయి. రాత్రి 10 తర్వాత ప్రచారం చేస్తే కేసు పెట్టాలని మేమే చెప్పామన్నారు అసద్.

ఇక 119 మంది సభ్యులున్న తెలంగాణ శాసనసభకు నవంబరు 30న పోలింగ్ జరగనుంది. డిసెంబరు 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలను ప్రకటిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…