Telangana Elections: వ్యూహం.. ప్రతివ్యూహం.. హైస్పీడులో దూసుకెళ్తున్న పార్టీలు.. రేపు తెలంగాణకు ప్రధాని మోదీ

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం (నవంబర్ 7) హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.

Telangana Elections: వ్యూహం.. ప్రతివ్యూహం.. హైస్పీడులో దూసుకెళ్తున్న పార్టీలు.. రేపు తెలంగాణకు ప్రధాని మోదీ
Telangana Elections

Updated on: Nov 06, 2023 | 9:05 AM

Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తేదీ గడువు సమీపిస్తుండటంతో ప్రధాన పార్టీలన్నీ ఉధృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మంగళవారం (నవంబర్ 7) హైదరాబాద్ ఎల్‌బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం ఐదున్నర గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియం వెళ్లి బహిరంగ సభకు హాజరవుతారు. బీసీ గర్జన సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందిని సభకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లను ఆ పార్టీ ప్రతినిధుల బృందం ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. బీసీ నినాదాన్ని ఎత్తుకున్న బీజేపీ.. తెలంగాణలో బీసీని ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ప్రకటించడంతో ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది.

కాంగ్రెస్ మైనారీటీ డిక్లరేషన్..

మరోవైపు వరుస సభలకు టీకాంగ్రెస్ ప్లాన్ చేసింది. ఈనెల 9న ముస్లిం మైనారీటీ డిక్లరేషన్ ప్రకటన చేసేందుకు హస్తం పార్టీ సన్నద్ధమౌతోంది. హైదరాబాద్ లేదా నిజామాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి పార్టీ సీనియర్‌ నేత సల్మాన్ ఖుర్షిద్‌తో మైనారిటీ డిక్లరేషన్ విడుదల చేయాలని కాంగ్రెస్‌ పార్టీ యోచిస్తోంది. ఈ నెల 10న కామారెడ్డి సభ ఏర్పాటు చేసి బీసీ డిక్లరేషన్ ప్రకటించాలని కూడా టీ కాంగ్రెస్‌ సన్నద్ధమౌతోంది. కామారెడ్డి సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య హాజరౌతారని తెలుస్తోంది.

స్పీడు పెంచిన బీఆర్ఎస్..

బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ నెల 9 వరకు రెండోవిడత ప్రచారంలో భాగంగా మరో 10 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. అలాగే ఈ నెల 13 నుంచి 28 వరకూ మూడోవిడత ప్రచారంలో భాగంగా 16 రోజుల పాటు 54 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. ఈ నెల 25న హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ నిర్వహణకు బీఆర్‌ఎస్‌ ఏర్పాట్లు చేస్తోంది. 28న గజ్వేల్‌ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్‌ ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. దీంతో మొత్తం 96 సభల్లో కేసీఆర్‌ పాల్గొన్నట్లు అవుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. వివిధ నియోజకవర్గాల్లో హరీశ్‌ రావు, కేటీఆర్‌, ఇతర సీనియర్‌ మంత్రుల పర్యటనలున్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..