AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: మాజీ హోం మంత్రిపై పార్టీల చూపు.. దేవేందర్ గౌడ్‌తో మధు యాష్కి కీలక భేటీ

మరో 13 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే నేతల కండువాలు మారుతున్నాయి. పార్టీ అధినాయకత్వంపై కోపంతో జంపింగ్ జపాంగ్‌ల్లా మారుతున్నారు. మరోవైపు గెలుపే లక్ష్యంగా నేతలు, ఇతర పార్టీ నాయకుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.

Telangana Election: మాజీ హోం మంత్రిపై పార్టీల చూపు.. దేవేందర్ గౌడ్‌తో మధు యాష్కి కీలక భేటీ
Madhu Yaski Goud Meet Devendar Goud
Balaraju Goud
|

Updated on: Nov 17, 2023 | 12:56 PM

Share

మరో 13 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే నేతల కండువాలు మారుతున్నాయి. పార్టీ అధినాయకత్వంపై కోపంతో జంపింగ్ జపాంగ్‌ల్లా మారుతున్నారు. మరోవైపు గెలుపే లక్ష్యంగా నేతలు, ఇతర పార్టీ నాయకుల మద్దతు కూడగట్టే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే సీనియర్ లీడర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. తాజాగా మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్‌తో కాంగ్రెస్‌‌ ప్రచార కమిటీ చైర్మన్‌, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ సమావేశమయ్యారు.

అసెంబ్లీ ఎన్నికల వేళ ఒక్కొక్కరుగా నేతలు పార్టీలు మారుతున్నారు. తాజాగా బీజేపీకి విజయశాంతి గుడ్‌బై చెప్పారు. కొంతకాలంగా జరుగుతున్న పొలిటికల్‌ హైడ్రామాకు తెరదించారు. విజయశాంతి మాత్రమే కాదు.. ఇప్పటికే మాజీ ఎంపీలు వివేక్, రాజగోపాల్ రెడ్డి లాంటి చాలా మంది నేతలు పార్టీ కండువాలు మార్చేశారు. మరికొందరు బీజేపీ నేతలు కూడా త్వరలో రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరతారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంమంత్రి దేవేందర్‌ గౌడ్ కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న ప్రచారం జరుగుతుంది. తాజాగా ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధు యాస్కి గౌడ్ దేవేందర్ ‌గౌడ్‌తో భేటీ కావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంటోంది.

గతంలోనూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం దేవేందర్ గౌడ్‌తో సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది జులై 18న దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన తనయులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్‌లను రేవంత్ కలుసుకున్నారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతన్న వీరేందర్ గౌడ్‌తో సహా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్లు సమాచారం. ఆ సమయంలో రేవంత్ వెంట మధుయాష్కి గౌడ్, మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నట్లు సమాచారం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తూళ్ళ దేవేందర్ గౌడ్ తెలుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. చంద్రబాబు హయాంలో రెవిన్యూ, హోం మంత్రిగా కూడా పనిచేశారు. అయితే, తెలంగాణకు టీడీపీ అనుకూలంగా లేదంటూ 2008లో ఆ పార్టీకి రాజీనామా చేసి, నవ తెలంగాణ పార్టీని స్థాపించారు. అనంతరం 2009 ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం తరఫున పోటీచేసి ఓటమి చవిచూశారు. మరోసారి తెలంగాణ టీడీపీలో చేరి, కొంతకాలం పాటు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు.

ఇదిలావుంటే అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ చాలా కాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అమెరికాలో శస్త్ర చికిత్స చేయించుకున్న ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన తెలుగు దేశం పార్టీ వీడి భారతీయ జనతా పార్టీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన తనయుడు వీరేందర్ గౌడ్ ఒక్కరే కషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ గౌడ్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నారు.

ఇదిలావుంటే, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్.. రెండేళ్ల క్రితం బీజేపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఉప్పల్ నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా కనుమరుగయ్యే పరిస్థితి రావడంతో ఇక ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. కాగా, దేవేందర్ గౌడ్‌తో పాటు వీరేందర్ గౌడ్‌తో మధు యాస్కి గౌడ్ భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పూర్తిగా బలహీనపడిన నేపథ్యంలో ఆయన్ను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. లేదంటే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. అయితే ఎట్టి పరిస్థితిలో బీజేపీ వీడే ప్రసక్తే లేదని వీరేందర్ గౌడ్ తేల్చి చెప్పినట్టు సమాచారం.

మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. అధిష్టానం సూచనల మేరకు రాష్ట్రంలో పట్టున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ సీరియస్​ టాస్క్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల్లో అసంతృప్త నేతలను కలుస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…