ఏకంగా 16మంది ప్రభుత్వ ఉపాధ్యాయుల సస్పెన్షన్.. కాదు.. కాదు.. సర్వీస్ నుంచి తొలగింపు.. షాకిచ్చిన సర్కార్..!
ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహించిన వారే పక్కదారి పట్టారు. విధులకు హాజరు కాకుండా డుమ్మా కొట్టారు. సమాధానం ఇవ్వాలంటూ పలుమార్లు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో చర్యలు చేపట్టిన విద్యాశాఖ 16మంది ఉపాధ్యాయులను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుల తీరుతో ఇటీవల విద్యా శాఖకే మాయని మచ్చలు ఏర్పడుతున్నాయి. ఇక్కడ ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు సస్పెన్షన్ కాదు.. ఏకంగా సర్వీస్ నుంచి రిమూవ్ అయ్యారు. ఈ పెద్ద ఎత్తున టీచర్లను తొలగించడం తెలంగాణ రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి ఎందుకు తొలగించారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!
ఉపాధ్యాయులు అంటేనే సమాజంలో నానాటికి ప్రతిష్ట పాలవుతున్నారు. రోజు బడికి వెళ్లి పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయులు.. అడ్డదారులు తొక్కుతున్నారు. కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కొందరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా విధులకు గైర్హాజరవుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని పలు పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు పాఠశాలలకు రాకుండానే రాజభోగాలు అనుభవిస్తున్నారు. దీంతో విచారణ జరిపిన రాష్ట్ర విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే స్కూల్ అసిస్టెంట్ గీతారాణి, ఎస్జీటీలు విజయలక్ష్మి, శ్రీనివాస్ రెడ్డి, ఉమారాణి, ప్రభాకర్ రెడ్డి, అబ్దుల్ హమీద్, స్వప్న, మాధవి, నవీన్ కుమార్, ఎం. ఉమాదేవి, క్రాంతి కిరణ్, జె. ఉమాదేవి, నర్సింహారావు, శైలజ, భాగ్యలక్ష్మి, కిరణ్ కుమారి 2005 నుంచి 2022 వరకు అనధికారికంగా విధులకు గైర్హాజరయ్యారు. దీనిపై సమాధానం ఇవ్వాలంటూ ఐదు దఫాలుగా వీరికి నోటీసులు ఇచ్చినా స్పందించలేదు.
గైర్హాజరుపై సదరు ఉపాధ్యాయులు ఎలాంటి సమాధానం కూడా ఇవ్వలేదు. దీంతో విద్యాశాఖ అధికారులు గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి.. 16 మంది ఉపాధ్యాయులను సర్వీస్ నుంచి తొలగించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉంటూ దీర్ఘకాలికంగా గైరాజరైన 16 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు యాదాద్రి భువనగిరి జిల్లా డీఈవో సత్యనారాయణ తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..