Lock Down Telangana: ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని డీజీపీ మహేందర్ రెడ్డి.. పోలీసు అధికారులను ఆదేశించారు. బుధవారం నుంచి పది రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని రేంజ్ ఐజీలు, డీఐజీ లు, పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లతో డీజీపీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీ జితేందర్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ కమీషనర్లు, ఎస్పీ లు, డీఐజీ స్థాయి సీనియర్ పోలీస్ అధికారులందరూ విధిగా క్షేత్రస్థాయిలో ఉండి లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని అన్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు అన్ని ప్రధాన నగరాలు, జిల్లా హెడ్ క్వార్టర్లు, ప్రధాన నగరాలలో లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయ సంబంధిత కార్యకలాపాలు, ధాన్యం సేకరణ, రవాణా లపై ఏవిధమైన ఆంక్షలు లేవని తెలిపారు. జాతీయ రహదారులపై రవాణా పై ఏవిధమైన ఆంక్షలు లేవని అన్నారు. ప్రధాన రంగంలో ఉన్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తమ అక్రిడేషన్లు కానీ, పత్రికా పరమైన గుర్తింపు కార్డులు తమవెంట ఉంచుకోవాలని స్పష్టం చేశారు.
గ్రామాల్లో వ్యవసాయ సంబంధిత పనులు, ఉపాధిహామీ పనులను లాక్ డౌన్ నుండి మినహాయించారని డీజీపీ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు వారి శాఖా పరమైన గుర్తింపు కార్డులుంటే సరిపోతుందన్నారు. రాష్ట్రంలో జరిగే వివాహాలకు ఇరువైపులకు చెందిన 40 మంది మాత్రమే హాజరయ్యే విధంగా చూడాలని అన్నారు. వివాహలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతులు పొందాలని అన్నారు. అదేవిధంగా, మరణాలకు సంబంధించి కేవలం 20 మంది మాత్రమే హాజరు కావాలని డీజీపీ స్పష్టం చేశారు.
కరోనా వాక్సినేషన్‌కు ఎవరైనా వెళ్లాల్సివస్తే వారి మొదటి డోస్‌కు సంబందించిన సమాచారం సెల్ ఫోన్ లో చూసి వారికి సడలింపు ఇవ్వాలని అధికారులకు డీజీపీ దిశానిర్దేశం చేశారు. నిత్యావసర వస్తువుల రవాణా సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై డిజాస్టర్ మేనేజిమెంట్ చట్టంతో పాటు ఐపీసీ ప్రకారం తగు కేసులు నమోదు చేయాలని మహేందర్ రెడ్డి పోలీస్ అధికారులకు స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేసే వారికి ఈ- పాస్ విధానం ద్వారా సంబంధిత కమీషనర్లు, ఎస్పీ లు పాసులను జారీ చేస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి ప్రకటించారు.
Also read:
కరోనాతో మరణిస్తే ఎల్ఐసీ పాలసీ వర్తిస్తుందా? లేదా? ఎలా క్లెయిమ్ చేసుకోవాలో తెలిపిన LIC