తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త లొల్లి షురూ అయ్యింది..! పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో అత్యధికంగా ఓట్లున్న బీసీ వర్గానికి.. పార్లమెంట్ ఎన్నికల్లో తగిన సీట్లు కేటాయించాలని నేతలు పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఇతర ప్రధాన పార్టీలు బీజేపీ, బీ.ఆర్.ఎస్ లు మెజారిటీ సీట్లు కేటాయించడంతో కాంగ్రెస్‌లో ఒత్తిడి పెరుగుతోంది. బీసీలకు సామాజిక న్యాయం జరగాలంటే.. తగిన సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు ప్రకటించిన తొమ్మిది సీట్లలో కేవలం రెండు మాత్రమే బీసీ అభ్యర్థులున్నారు. మిగతా ఎనిమిది సీట్లలో కనీసం సగం సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ బీసీ నేతలు అడుగుతున్న సీట్లేవి..? కాంగ్రెస్‌లో బీసీలకు ఎక్కడెక్కడ ఇచ్చే ఛాన్స్ ఉంది..? వాచ్ దిస్ స్టోరీ..
తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. తెలంగాణలోని 17 సీట్లలో 14 స్థానాలు ఎలాగైనా గెలవాలని టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. అందుకు అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటికే.. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు 17 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాయి. కానీ.. కాంగ్రెస్ ఒక్కొక్క అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే.. కాంగ్రెస్‌లోని కొందరు నేతలు సామాజిక న్యాయంపై గొంతెత్తుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి మాట ఇచ్చి తప్పారని గుర్రుగా ఉన్నారు. ప్రతీ పార్లమెంట్ పరిధిలో బీసీలకు రెండు అసెంబ్లీ సీట్లు చొప్పున.. మొత్తంగా 34 సీట్లు కేటాయిస్తామని మాట ఇచ్చారు. కానీ.. తీరా ఎన్నికల సమయానికి కేవలం 23 సీట్లు మాత్రమే ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పార్టీ అధికారంలో ఉండటంతో పార్లమెంట్ ఎన్నికల్లోనైనా సామాజిక న్యాయం పాటించాలని కోరుతున్నారు టీ.కాంగ్రెస్‌లోని బీసీ నేతలు..
మరోవైపు.. తాము అధికారంలోకి వస్తే బీసీ కులగణనతో సామాజిక న్యాయం చేస్తామని భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పదే పదే చెప్తున్నారు. ఎన్నికల్లోనూ బీసీలకు పెద్దపీట వేస్తామని ప్రచారం చేసతున్నారు. కానీ.. తెలంగాణలో మాత్రం బీసీలకు తగిన ప్రాధాన్యం దక్కడం లేదని వీహెచ్ లాంటి సీనియర్లు వాపోతున్నారు. ఒకవైపు రాహుల్ బీసీ నినాదం ఎత్తుకుంటే.. తెలంగాణ కాంగ్రెస్ భిన్నమైన వైఖరి అవలంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే.. బీసీలకు బీజేపీ ఐదు, బీఆర్‌ఎస్ ఆరు స్థానాలు కేటాయించడంతో కాంగ్రెస్ కూడా మెజారిటీ సీట్లు కేటాయించాలని బీసీ నేతలు ప్రెజర్ పెడుతున్నారు. వాస్తవానికి.. టీ.కాంగ్రెస్ ఇప్పటివరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అందులోనూ.. రెండు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానానికి క్యాండేట్లను డిక్లేర్ చేసింది. మిగతా ఆరు స్థానాల్లో కేవలం రెండు మాత్రమే బీసీలకు కేటాయించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కార్, సికింద్రాబాద్ నుంచి దానం నాగేందర్‌ను కాంగ్రెస్ ప్రకటించింది. ఈ క్రమంలోనే.. ప్రస్తుతం పెండింగ్‌లోనున్న ఎనిమిది స్థానాల్లో కనీసం నాలుగు స్థానాలు బీసీలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఆ సామాజికవర్గం నేతలు.
ఇదిలావుంటే.. మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి బీసీ అభ్యర్థి నీలం మధు పేరు దాదాపు ఖరారైనట్లు టీకాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. అలాగే.. బీసీలకు మరో మూడు చోట్ల అవకాశం కల్పించాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు నేతలు. ఖమ్మం నుంచి సీనియర్ నేత వీహెచ్ పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క బీసీకి కూడా టికెట్ ఇవ్వలేదని.. పార్లమెంట్ ఎలక్షన్స్‌లోనైనా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. అలాగే.. భువనగిరి నుంచి పున్న కైలాష్ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ బీసీలకు టికెట్ ఇస్తే పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అటు.. నిజామాబాద్ నుంచి బీసీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు టికెట్ ఇవ్వాలని సీనియర్ నేత షబ్బీర్ అలీ సూచిస్తున్నారు.
మొత్తంగా.. తెలంగాణ కాంగ్రెస్‌లో బీసీ నినాదం మరోసారి బలంగా వినిపిస్తోంది. బీజేపీ, బీఆర్ఎస్ బీసీలకు మెజారిటీ ఎంపీ సీట్లు ఇవ్వడంతో కాంగ్రెస్‌పై ఒత్తిడి పెరుగుతోంది. బీసీ నేతల ప్రెజర్ నేపథ్యంలో పెండింగ్‌లోనున్న ఎనిమిది స్థానాల్లో కాంగ్రెస్ బీసీలకు ఎన్ని సీట్లు కేటాయిస్తుందదో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..