Political Cold War: నిధులు తెచ్చి అభివృద్ధి చేసినా.. సొంత నియోజకవర్గంలో పర్యటించలేని పార్లమెంటు సభ్యులు
రాజకీయాల్లో సీనియర్ నేత, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. తన పని తాను చేసుకుంటూ కూల్ గానే కనిపిస్తారు. కానీ ఆ ఎంపీకి ఇప్పుడో కొత్త తలనొప్పి తయారైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో అడుగు పెట్టాలంటేనే వెనకా ముందూ ఆలోచిస్తున్నారట.
Cold War in Zaheerabad: రాజకీయాల్లో సీనియర్ నేత, జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎంపీ(MP)గా పోటీ చేసి గెలుపొందారు. తన పని తాను చేసుకుంటూ కూల్ గానే కనిపిస్తారు. కానీ ఆ ఎంపీకి ఇప్పుడో కొత్త తలనొప్పి తయారైంది. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న లోక్ సభలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో(Assembly Constituency) అడుగు పెట్టాలంటేనే వెనకా ముందూ ఆలోచిస్తున్నారట. ఆయననే భీమారావు బసవంతరావు పాటిల్(BB Patil). ప్రస్తుతం అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) తరఫున జహీరాబాద్ పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
అవును నిజమే.. అధికార పార్టీ ఎంపీగా ఉంటూనే బీబీ పాటిల్ తన సొంత నియోజకవర్గంలోనే కాలు పెట్టలేకపోతున్నారు. ఆ నాలుగు నియోజకవర్గాలు మరేవో కావు.. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బాన్సువాడ జహిరాబాద్ లోక్‌సభ పరిధిలోకే వస్తాయి. కానీ ఇప్పుడీ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎంపీ పాటిల్ పర్యటించడమే గగనమై పోయింది. తొలిసారి గెలిచినపుడు కూడా అడపాదడపా కనపించిన ఎంపీ పాటిల్ ఇపుడీ ప్రాంతాల్లో కనీస దర్శనాలు కరవట. దీంతో కింది స్థాయి నాయకులు ఒకటే గుసగుసలాడుతున్నారట. నియోజకవర్గాల్లో సాధారణంగా ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంటుంది. కానీ ఇక్కడ అంతకన్నా మించి అని మాట్లాడుకుంటున్నారు. నిధులు తీసుకొచ్చినా కూడా ఆ ఎమ్మెల్యేలు, ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలకు కనీస ఆహ్వానాలు ఇవ్వడం లేవట. దీంతో రెండు మూడు సార్లు సీఎం కేసీఆర్ దగ్గర, మంత్రి కేటీఆర్ దగ్గరా.. ఎంపీ పాటిల్ తన గోడు చెప్పుకుని బాధ పడ్డారట.
ఇదిలా ఉంచితే- తమపై ఎంపీ చేసిన ఫిర్యాదులకు తగిన మూల్యం చెల్లించేలా స్కెచ్ వేశారట సదరు ఎమ్మెల్యేలు. అసలా ఎంపీ పార్టీ మారుతున్నట్టు పుకార్ లేపి వదిలారట. అందుకే ఆయన తన సెగ్మెంట్లో కనీస దర్శనాల్లేవన్న మాట జోడించారట. దీంతో పాటిల్ ఇమేజీకి ఇంకాస్త డ్యామేజీ అయ్యిందట. గతంలో ఈ ఎమ్మెల్యేలతో ఎంపీ పాటిల్‌కు మంచి సంబంధాలే ఉండేవి. కానీ అసెంబ్లీ ఎన్నికలపుడు.. పాటిల్ తమకు కోపరేట్ చేయలేదన్నది వీళ్ల అసంతృప్తిగా తెలుస్తోంది. అప్పటి నుంచీ మొదలైన ఈ కోల్డ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉన్నట్టు సమాచారం. అందుకే నియోజకవర్గాల అభివృద్ధి పనుల్లో ఎంపీని ప్రొటోకాల్ ప్రకారం ఇన్వైట్ చేయాల్సి ఉన్నా.. లెక్క చేయడం లేదన్న మాట వినిపిస్తోంది.
రెండెద్దుల కొట్లాట మధ్య చిక్కిన లేగదూడ నలిగినట్టు.. నియోజవర్గాల అభివృద్ధిలో ఎమ్మెల్యే- ఎంపీలు ఒకరికొకరు సహకరించుకుని జనానికి అంత మేలు చేయాలి. కానీ ఆ మాటే మరచి ఎవరికి వాళ్లు ఇగో వార్ మొదలు పెడితే, నష్టపోయేది మాత్రం ప్రజలే. కాబట్టి అధిష్టానం ఇప్పటికైనా ఒక నిర్ణయానికి రావాలని, పార్టీలో అంతర్గత కమ్ములాటలకు ఇప్పటికైనా ఫుల్‌స్టాప్ పెట్టాలని సొంత పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.
Read Also.. Andhra Pradesh: సచివాలయానికి అందరూ రావల్సిందే.. ఉన్నతాధికారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు