Hyderabad Metro: హైదరాబాద్‌లో మెట్రో విస్తరణ.. ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్.. మరో 4 కారిడార్లలో నిర్మాణం
భాగ్యనగర ప్రజల ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ తన సేవలను అందిస్తున్న మెట్రో విస్తరణకు రంగం సిద్ధమైంది. ఫేజ్ -2 మెట్రో విస్తరణ రూట్ మ్యాప్‌ను సీఎం రేవంత్ రెడ్డికి అందించారు అధికారులు. కొత్తగా మరో 4 కారిడార్లలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. మెట్రో విస్తరణలో నాగోల్ నుంచి శంషాబాద్‌కు నిర్మించే రూటే.. అతిపెద్దది కానుంది.
హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణకు రూట్ మ్యాప్ ఖరారైంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో అధికారులు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. మొత్తం 70 కిలోమీటర్ల మేర కొత్త మెట్రో మార్గాన్ని నిర్మించేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు అధికారులు. ఆ వివరాలను సీఎంకు అందించారు. విస్తరణలో భాగంగా జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు మెట్రో మార్గాన్ని పొడిగించనున్నారు. కొత్తగా మరో నాలుగు కారిడార్లలో నిర్మాణం చేపట్టనున్నారు.
కారిడార్ 2 కింద.. ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అలాగే.. ఫలక్‌నుమా నుంచి చాంద్రాయణగుట్ట క్రాస్‌రోడ్డు వరకు 1.5 కిలోమీటర్ల మేర రూట్ మ్యాప్ రెడీ చేశారు. కారిడార్ 4 కింద.. నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు.. 29కిలోమీటర్లు ప్రపోజల్స్ రెడీ చేశారు. నాగోల్-ఎల్బీనగర్-చాంద్రాయణగుట్ట-మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఎయిర్‌పోర్టు వరకు మెట్రో వెళ్లనుంది. మరోవైపు మైలార్‌దేవ్‌పల్లి నుంచి హైకోర్టు వరకు 4 కిలోమీటర్ల మేర మరో రూట్ మ్యాప్ రెడీ అయింది.
ఇక కారిడార్ 5 కింద.. రాయదుర్గం నుంచి అమెరికన్ కాన్సులేట్ వరకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాయదుర్గం- నానక్‌రామ్‌గూడ- విప్రో జంక్షన్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు 8 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరిస్తారు. కారిడార్ 6 కింద.. మియాపూర్ నుంచి పటాన్‌చెరు వరకు 14 కిలోమీటర్లు మరో రూట్ మ్యాప్ సిద్ధమైంది. మియాపూర్-పటాన్‌చెరు-బీహెచ్‌ఈఎల్ మీదుగా.. పటాన్‌చెరు చేరనుంది మెట్రో. కారిడార్ 7కింద.. ఎల్బీనగర్ నుంచి వనస్థలిపురం, హయత్ నగర్ వరకు.. 8 కిలోమీటర్లు.. మరో ప్రపోజల్ సిద్ధం చేశారు. వీటన్నింటికీ సీఎం రేవంత్ ఆమోదమే మిగిలి ఉంది. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాత.. వెంటనే పనులు మొదలయ్యే అవకాశాలున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..