AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Cabinet: ఇంటర్వూ లేకుండానే గ్రూప్ 1,2 ఉద్యోగాలు.. పోలీసు అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు

తెలంగాణలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Telangana Cabinet: ఇంటర్వూ లేకుండానే గ్రూప్ 1,2 ఉద్యోగాలు.. పోలీసు అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి పెంపు
Kcr On Jobs
Balaraju Goud
|

Updated on: Apr 12, 2022 | 9:04 PM

Share

Telangana Cabinet Decisions: తెలంగాణలో త్వరలోనే భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాలను చేపట్టనున్న సంగతి తెలిసిందే. నియామకాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వూలు అవసరం లేదనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అదే విధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఇతర గెజిటెట్ పోస్టుల నియామకాల్లో పాదర్శకత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపు అలాగే, పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు రాష్ట్ర కేబినెట్‌ తీపి కబురు అందించింది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక, ప్రైవేట్ రంగంలోనూ ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరింత మెరుగు పడాల్సిన అవసరముందన్నారు. ఇందులో భాగంగా ఐటీ తదితర పరిశ్రమల స్థాపన కేవలం నగరంలోని గచ్చిబౌలి, మాదాపూర్ ప్రాంతాలకే పరిమితం కాకూడదని, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిపంజేయాలని తద్వారా హైదరాబాద్ నలుమూలలా సమానమైన అభివృద్ధి జరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. దీంతో అన్ని ప్రాంతాల వారికీ ఉద్యోగాలు దొరుకుతాయన్నారు.

మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితి పెంపు గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ల ఉద్యోగ విరమణ పరిమితిని 65 సంవత్సరాలకు పెంచింది. తాజాగా మెడికల్ కాలేజీ ప్రొఫెసర్లను డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్, అడిషనల్ డైరక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా నియమించడానికి అనుమతినిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

విశ్వవిద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకం ఇక నుండి విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాలు ఒకే ఒక నియామక సంస్థ కామన్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ద్వారా జరపాలని రాష్ట్ర కేబినేట్ నిర్ణయించింది. ప్రస్తుతం ఏ విశ్వవిద్యాలయానికి ఆ విశ్వవిద్యాలయమే సిబ్బంది నియామకాలను చేపట్టే పద్ధతి అమలవుతుంది. అందుకు భిన్నంగా ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధంగా అన్ని విశ్వవిద్యాలయాల సిబ్బంది నియామకాన్ని పారదర్శకంగా ఒకే నియామక సంస్థ ద్వారా జరపాలని కేబినేట్ నిర్ణయం తీసుకుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగా 3,500 పై చిలుకు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకాలను చేపట్టాలని కేబినేట్ నిర్ణయించిందన్నారు. రాష్ట్రంలో మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది.