Telangana Cabinet: కొత్తగా 10 లక్షల మందికి పెన్షన్లు.. తెలంగాణ కేబినెట్‌కీలక నిర్ణయాలు ఇవే..
సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు జరిగాయి. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు ఐటీ సెక్టార్‌పైనా ప్రత్యేక దృష్టిపెట్టింది. సుదీర్ఘంగా 5 గంటల పాటు సాగిన తెలంగాణ కేబినెట్‌లో..
ఓవైపు మునుగోడు ఉపఎన్నిక.. మరోవైపు కేంద్రంతో ఫైటింగ్ నడుస్తున్న సమయంలో తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సంక్షేమ, అభివృద్ధికి సంబంధించిన అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితితో పాటు ఐటీ సెక్టార్‌పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ మంత్రి వర్గ సమావేశం సుదీర్ఘంగా 5 గంటల పాటు జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో కొత్తగా 10 లక్షల పెన్షన్లు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 36 లక్షల పెన్షన్లతోపాటు మరో 10 లక్షల కొత్త పెన్షన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇలా కొత్తవి.. పాతవి కలిపి 46 లక్షల పెన్షన్ కానున్నాయి. పెన్షన్లతోపాటు కోఠి ఈఎన్.టి ఆస్పత్రికి 10 మంది స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని నిర్ణయించింది. వారిని నియమించేందుకు ఉత్తర్వులు కూడా జారీ చేయడంతోపాటు ఆస్పత్రిలో కొత్త టెక్నాలజీతో కూడిన సౌకర్యాలను అందించాలని ఈ.ఎన్.టి టవర్ నిర్మించబోతోంది.
సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలో కూడా అధునాతన వసతులతో కూడిన నూతన భవన సముదాయం నిర్మించేందుకు ప్రతిపాదనలు చేసింది తెలంగాణ కేబినెట్. కోఠిలోని వైద్యారోగ్యశాఖ సముదాయంలో కూడా ఒక అధునాతన హాస్పెటల్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 5 వేల 111 అంగన్ వాడీ టీచర్లు, ఆయా పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
స్వాతంత్ర్య దినోత్సవ సమయంలో 75 మంది ఖైదీల విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అంతే కాకుండా ఈనెల 21న నిర్వహించాలని అనుకున్న శాసనసభ, స్థానిక సంస్థల ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది. అదే రోజున భారీగా పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉండటంతో ఈ ప్రత్యేక సమావేశాలను రద్దు చేసింది. స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో 16వ తేదీన ఉదయం 11.30 నిమిషాలకు రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించాలని తెలంగాణ మంత్రి వర్గం నిర్ణయించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..