తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ధరణి విషయంలో కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే.. ధరణి పోర్టల్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. తాజాగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న బండి సంజయ్.. బీజేపీ అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ అలాగే కొనసాగుందని తెలిపారు. అయితే, పోర్టల్‌లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు బండి సంజయ్. అంతేకాదండోయ్.. తాము అధికారంలోకి వచ్చినా కేసీఆర్ పథకాలన్నింటినీ కొనసాగిస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వంపై బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు.
‘సారు, కారు, 60 పర్సంటేజీ’ అన్నట్లుగా బీఆర్ఎస్ సర్కార్ తీరు ఉందని విమర్శించారు బండి సంజయ్. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. కాంగ్రెస్‌ను లేపడానికి కేసీఆర్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోందని అన్నారు. తామెప్పుడూ ధరణి వెబ్‌సైట్‌ను తొలగిస్తామని చెప్పలేదని, అయితే, ధరణి బాధితులకు న్యాయం చేస్తామని ప్రకటించారు బండి సంజయ్. ఇక మోదీ కూడా మనకు మిత్రుడే అంటూ కేసీఆర్ కామెంట్ చేయడం.. కాంగ్రెస్‌ను పైకి లేపడానికి చేస్తున్న ప్రయత్నంగా పేర్కొన్నారు బండి సంజయ్. కాంగ్రెస్‌లో ప్రీ, పోస్ట్ పెయిడ్ అభ్యర్థులను కేసీఆర్ తయారు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు ఇచ్చింది కేసీఆరే అని ఆరోపించారాయన. బీజేపీని ఓడించడానికి కేసీఆర్ డబ్బులు పంపిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు బండి సంజయ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..