
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో జరిగిన డ్రామా వెనుక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అంతా ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. మునుగోడు ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు ఓటమి తప్పదని తెలియడంతో కేసీఆర్ బీజేపీని బద్నాం చేసేందుకు రెండు టీవీ ఛానళ్లతో కలిసి ఇలాంటి నీచమైన డ్రామాకు తెరదీశారంటూ బండి సంజయ్ మండిపడ్డారు. కేసీఆర్‌కు దమ్ముంటే.. ఈ వ్యవహారానికి సంబంధించి ఫాంహౌజ్‌లో, హోటల్‌లో, ప్రగతి భవన్‌లో గత వారం రోజులుగా జరిగిన సన్నివేశాలకు సంబంధించి సీసీ పుటేజీలన్నీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. దీంతో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. ఈ వ్యవహారంలో బీజేపీకి సంబంధమేలేదని.. ఇదే విషయంపై తనతోపాటు బీజేపీ నేతలంతా యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి ఆలయం వద్దకు వచ్చి ప్రమాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కేసీఆర్ కు ఈ డ్రామాలో పాత్ర లేదని భావిస్తే.. భార్యాపిల్లలతో కలిసి యాదాద్రికి వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని, ఈ డ్రామాకు తెరదీసిన టీఆర్ఎస్ ను రాజకీయ సమాధి చేయడంతోపాటు దీని వెనుకనున్న పోలీసుల అంతు చూస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేల కొనుగులు విషయం బయటకొచ్చిన అనంతరం మర్రిగూడ మండలంలోని తిరగండల్లపల్లిలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం డ్రామాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
ఈ వ్యవహారంలో జరిగిన డ్రామాను చూస్తే నవ్వొస్తుందని.. ఫిర్యాదు చేసింది వాళ్లే.. బాధితులు వాళ్లే.. నేరస్తులు వాళ్లే.. అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. మునుగోడు జనం నవ్వుకుంటున్నరని.. కేసీఆర్ ఇంకా డ్రామాలు బంద్ చేయలేదన్నారు. అసలా ఫాంహౌజ్ ఎవరిది? స్వామిజీలను కేసులో ఇరికిస్తారా? హిందూ ధర్మ మంటే అంత చులకనా? అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లి చేసిన కుట్ర ఇది.. అక్కడ స్వామిజీలను పిలిపించుకుని ఈ స్టోరీ ప్లాన్ చేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ నాయకులు 3 రోజుల నుండి అక్కడే మకాం వేశారని.. సీసీ టీవీ పుటేజీలు బయటికి వస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుందన్నారు.
ఈ డ్రామా వెనుక పోలీసాఫీసర్ పాత్ర ఉందంటూ ఆరోపించారు. దీనికంతటికీ స్కెచ్ వేసింది కేసీఆరేనని ఇప్పుడే ఆ ఎమ్మెల్యే చెప్పారని.. కేసీఆర్ కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందననారు. ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్టే ప్రసక్తే లేదని.. మొత్తం బండారం బయటపెడతామంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. కొంతమంది టీఆర్ఎస్ నేతలు అడ్డగోలుగా వాగుతున్నరు.. నోటిని హద్దులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..