Telangana BJP: గేర్‌ మార్చిన బీజేపీ.. తెలంగాణలో బెంగాల్‌ తరహా ప్లాన్..

|

Oct 04, 2023 | 5:00 PM

Telangana BJP: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది బీజేపీ. అందులో సందేహమే లేదు. కాని, కొన్ని నెలలుగా పరిస్థితి అనుకున్నంతగా లేదు. ఇది కూడా ఒప్పుకుని తీరాల్సిన వాస్తవమే. పార్టీ నాయకత్వంపై అలకలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం..

Telangana BJP: గేర్‌ మార్చిన బీజేపీ.. తెలంగాణలో బెంగాల్‌ తరహా ప్లాన్..
Telangana BJP
Follow us on

Telangana BJP: తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగింది బీజేపీ. అందులో సందేహమే లేదు. కాని, కొన్ని నెలలుగా పరిస్థితి అనుకున్నంతగా లేదు. ఇది కూడా ఒప్పుకుని తీరాల్సిన వాస్తవమే. పార్టీ నాయకత్వంపై అలకలు, నేతల మధ్య సమన్వయం లేకపోవడం స్పష్టంగా కనిపించింది. సరిగ్గా అదే సమయంలో కాంగ్రెస్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. దీంతో తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ ఎవరు అనే నెంబర్‌ గేమ్‌లో బీజేపీ కాస్త వెనకబడినట్టైంది. ఎన్నికలకు రెండు నెలల ముందు పార్టీలో ఈ నిరుత్సాహం కచ్చితంగా పనికిరాదు. అందుకే, గేర్‌ మార్చాలంటే పెద్ద అడుగు పడాల్సిందే అనుకున్నారు. అనుకున్నట్టుగానే మూడు రోజుల వ్యవధిలోనే రెండుసార్లు తెలంగాణలో అడుగుపెట్టారు ప్రధాని మోదీ. నిజామాబాద్‌ పర్యటనలో 8021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేశారు. ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌ కింద తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌ విభాగాలకు శంకుస్థాపన చేశారు. 1200 కోట్లతో నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను, సిద్దిపేట–సికింద్రాబాద్‌ తొలి రైలు సర్వీసును ప్రారంభించారు.

అంతకు ముందు పాలమూరు సభలోనూ సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్‌లో పసుపు బోర్డ్‌ ప్రకటించారు. ఈ రెండు ప్రకటనలతో బీజేపీలో మళ్లీ జోష్ పెరిగింది. ఇకపై ఇలాంటి పర్యటనలతో పాటు ప్రకటనలు సైతం ఉండేలా ప్లాన్ చేస్తోంది బీజేపీ. రాష్ట్రానికి ఏ పథకానికి ఎన్ని నిధులు ఇచ్చారన్న వివరాలను కేంద్ర బీజేపీ పెద్దలతోనే చెప్పించేందుకు స్టేట్ బీజేపీ చీఫ్‌ కిషన్ రెడ్డి కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నెలరోజుల్లో రోజుకో సభ ఉండేలా.. మొత్తం 119 నియోజకవర్గాల్లో 30 నుంచి 40 సభలు పెట్టేలా ఓ సరికొత్త వ్యూహరచన చేశారు. బెంగాల్‌లోనూ సరిగ్గా ఇదే స్ట్రాటజీతో వెళ్లింది బీజేపీ. అక్కడ కేంద్ర బీజేపీ పెద్దలతో వరుస సభలు పెట్టించింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందుతున్న నిధులను ఆ లీడర్లతోనే చెప్పించింది. ఆ ప్రయత్నంతోనే బెంగాల్‌లో జీరో నుంచి బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది బీజేపీ. అదే స్ట్రాటజీని తెలంగాణలోనూ అప్లై చేయాలనుకుంటోంది కమలదళం. పైగా తెలంగాణలో జీరో నుంచి రావాల్సిన అవసరం లేదు. ఈ మధ్య అడ్డొచ్చిన కొన్ని స్పీడ్ బ్రేకర్లను తీసేస్తూ, గేర్‌ మారిస్తే సరిపోతుందని భావిస్తోంది. ఆ ప్లాన్‌లో భాగంగానే ప్రధాని మోదీ తెలంగాణకు రెండుసార్లు వచ్చారు.

వరుస సభలతో హోరెత్తించనున్న బీజేపీ..

ప్రధాని పాలమూరు, ఇందూరు సభలతో పార్టీ క్యాడర్‌లో జోష్ పెరిగింది. మోదీ పర్యటనకు ముందు.. మోదీ పర్యటన తర్వాత అన్నట్లుగా తెలంగాణ బీజేపీలో ఓ జోరు కనిపిస్తోంది. పసుపుబోర్డు, గిరిజన యూనివర్సిటీల ప్రకటన పార్టీకి కచ్చితంగా ప్లస్‌ అవుతుందని పార్టీ భావిస్తోంది. తెలంగాణలో ముందు నుంచి ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపైనే ఫోకస్ పెడుతూ వస్తోంది బీజేపీ. ములుగు జిల్లాలో గిరిజన యూనివర్సిటీ ప్రకటించడంతో ఆ దిశగా పెద్ద అడుగు పడినట్టేనని భావిస్తున్నారు. ఈ టెంపోను ఇలాగే కొనసాగించేందుకు త్వరలో నిర్మల్, కరీంనగర్‌లో మోదీతో భారీ బహిరంగ సభలకు ప్లాన్ చేస్తున్నట్టు రాష్ట్ర బీజేపీ చెబుతోంది. మోదీ సభల కంటే ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈనెల 6న హైదరాబాద్ వస్తున్నారు. మోదీ మళ్లీ తెలంగాణకు వచ్చే సమయానికి తెలంగాణలో బీజేపీని ఎన్నికలకు సర్వసన్నద్దం చేయడంతోపాటు గెలుపు వ్యూహాలపై ఓ క్లారిటీ తీసుకురానున్నారు జేపీ నడ్డా. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ నిర్మల్, కరీంనగర్ సభలు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఈలోపే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తెలంగాణలో పర్యటిస్తారు. అమిత్‌షా షెడ్యూల్‌ 10వ తేదీన ఫిక్స్ చేశారు. మోదీ, షా, జేపీ నడ్డాతో పాటు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కర్నాటక, మహారాష్ట్ర నుంచి జాతీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను తెలంగాణలో దించుతోంది బీజేపీ. ఈ సభల ద్వారా తెలంగాణ సమాజానికి మరో విషయం కూడా స్పష్టం చేయదలచుకుంది కమలదళం. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ కాంగ్రెస్ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు ఈ సభలను ఉపయోగించుకోవాలనుకుంటోంది. దానికి తగ్గట్టే కార్యాచరణను సైతం సిద్ధం చేస్తోంది. ఈ రెండు పార్టీలు ఒక్కటే అనే భావన కారణంగానే కొందరు నేతలు పార్టీకి దూరంగా ఉంటున్నారన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అందుకే, ప్రధాని మోదీ వచ్చిన సమయంలోనూ పార్టీలో అసంతృప్తులు కనిపించాయి. మోదీ పాలమూరు సభకు కొందరు కీలక నేతలు దూరంగా ఉండడం స్పష్టంగా కనిపించింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్, ఏనుగు రవీందర్ రెడ్డి సభకు హాజరు కాలేదు. దీంతో ఏం చెబితే రెండు పార్టీలు ఒకటి కాదు అని నమ్ముతారో, ఎలాంటి లెక్కలు బయటపెడితే బీజేపీ వేరు, బీఆర్‌ఎస్‌ వేరు అని నమ్ముతారో అలాంటి ప్రసంగాలు, లెక్కలతో ప్రజల ముందుకు రాబోతోంది బీజేపీ. ఇప్పటికే 2014కు ముందు కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల నుంచి ఎంత ధాన్యం కొన్నదో, బీజేపీ ప్రభుత్వం వచ్చాక ఎంత ధాన్యం కొన్నదో లెక్కలతో సహా చెప్పారు. ఎన్నికల వరకు ఇలాంటి లెక్కలతోనే ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నారు. అవసరమైతే పదునైన విమర్శనాస్త్రాలు సంధించేందుకు కూడా రెడీ అవుతున్నారు కేంద్ర బీజేపీ నేతలు.

ఇవి కూడా చదవండి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పలు రాష్ట్రాలకు చెందిన బీజేపీ కీలక నాయకులు, కేంద్ర మంత్రులతో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలోని 26 మంది నేతలు ఎన్నికలు పూర్తయ్యే వరకు ఫుల్‌ ఫోకస్‌ తెలంగాణపైనే పెట్టబోతున్నారు. ఈనెల 5వ తేదీన ఈ కమిటీతో జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. పార్టీని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అవసరమైన కార్యక్రమాలపై ఆ సమావేశంలో చర్చిస్తారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ఓటర్లను నేరుగా కలిసేలా ఓ ప్రణాళిక రచించబోతున్నారు. అయితే, తెలంగాణలో జనసేన పార్టీ ఒంటరిపోరు కాస్త కలవరపెట్టే అంశం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణలో పోటీ చేయబోయే 32 నియోజకవర్గాల జాబితాను జనసేన ఇప్పటికే విడుదల చేసింది. దాదాపుగా టీడీపీ ఓటు షేర్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాలనే ఎంచుకుంది జనసేన. ఇది తెలంగాణ బీజేపీపైనా కచ్చితంగా ప్రభావం చూపించేదే. కూకట్‌పల్లి, ఎల్బీనగర్‌, కుత్బుల్లాపూర్‌, శేరిలింగంపల్లి, పటాన్‌చెరు, సనత్‌నగర్‌, ఉప్పల్‌, మేడ్చల్‌, మల్కాజిగిరి, ఖమ్మం, వైరా, కొత్తగూడెం, అశ్వారావుపేట, కోదాడ, సత్తుపల్లి నియోజకవర్గాల్లో టీడీపీకి ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పటికే తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా అనేలా పోటీ పడుతున్నాయి. జనసేన కూడా తనకు బలం ఉన్న నియోజకవర్గాల నుంచి బరిలో దిగుతుండటంతో.. ఎవరి ఓటు షేర్‌ షిఫ్ట్‌ అవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిజానికి జనసేన ప్రకటించిన కొన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి కూడా బలం ఉంది. కొన్నింట్లో గెలిచే పరిస్థితి కూడా ఉందంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో జనసేన ఒంటరి పోరు బీజేపీపైనా ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అలాగని ఇప్పటికిప్పుడు జనసేనతో పొత్తు గురించి ఎవరూ మాట్లాడడం లేదు. కాకపోతే.. పవన్‌ కల్యాణ్‌కు యూత్‌లో ఉన్న క్రేజ్, చంద్రబాబు అరెస్ట్ ఎఫెక్ట్‌ కారణంగా.. బీజేపీకి పడాల్సిన ఓట్లపై జనసేన ప్రభావం చూపించొచ్చు అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటి వరకైతే పవన్‌ కల్యాణ్‌పై ఉన్న అభిమానం పూర్తిస్థాయిలో ఓటుగా మారినట్టుగా అయితే అనిపించలేదు. మరి ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేం.

మొత్తానికి తెలంగాణలో బీజేపీ స్పీడ్‌ పెంచిందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత షార్ట్ గ్యాప్‌లో ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చారంటేనే.. ఫోకస్ ఏ రేంజ్‌లో ఉందో తెలిసిపోతోంది. అటుపైన అమిత్‌ షా, జేపీ నడ్డా, బీజేపీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు కూడా వస్తుండడంతో.. ఇకపై తెలంగాణ బీజేపీలో మునుపటి ఉత్సాహం కచ్చితంగా కనిపిస్తుందని చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..