AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Elections: పండగ తర్వాతే కాంగ్రెస్ 2వ జాబితా.. జాప్యానికి రెబెల్స్ భయమే కారణమా..

తొలి జాబితా విడుదల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో ఇతర పార్టీల నుంచి ఎగురుకుంటూ వచ్చిన పారష్యూట్ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటు స్వరం వినిపించడం కూడా ఇందుకు కారణమని పార్టీవర్గాలు చెబుతున్నాయి. శనివారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో 2వ జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరిగినప్పటికీ..

Telangana Elections: పండగ తర్వాతే కాంగ్రెస్ 2వ జాబితా.. జాప్యానికి రెబెల్స్ భయమే కారణమా..
Telangana Congress
Mahatma Kodiyar
| Edited By: Sanjay Kasula|

Updated on: Oct 22, 2023 | 2:44 PM

Share

కాంగ్రెస్ 2వ జాబితా విడుదలకు మరికొంత సమయం పట్టేలా కనిపిస్తోంది. తొలి జాబితా విడుదల తర్వాత చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి. తొలి జాబితాలో ఇతర పార్టీల నుంచి ఎగురుకుంటూ వచ్చిన పారష్యూట్ నేతలకు అధిక ప్రాధాన్యతనిచ్చారన్న విమర్శలతో పాటు టికెట్ ఆశించి భంగపడ్డ ఆశావహులు తిరుగుబాటు స్వరం వినిపించడం కూడా ఇందుకు కారణమని పార్టీవర్గాలు చెబుతున్నాయి.

శనివారం పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో 2వ జాబితాపై సుదీర్ఘ కసరత్తు జరిగినప్పటికీ.. అది కేవలం హోంవర్క్ మాత్రమేనని, తదుపరి అవసరమైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశమవుతుందని, లేదంటే నేరుగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి జాబితా పంపిస్తామని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రే తెలిపారు.

మొత్తంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఆమోదం తెలిపితేనే జాబితా విడుదలవుతుందని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్, మల్లికార్జున ఖర్గే వంటే అగ్రనేతలతో కూడిన ఈ కమిటీ భేటీ అవ్వాలంటే ఆ ముగ్గురికీ అనువైన తేదీలు, సమయం చూసుకోవాలి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ముగ్గురు అగ్రనేతల్లో కనీసం ఇద్దరైనా అందుబాటులో ఉంటే తప్ప సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీ జరిగే అవకాశం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే విజయదశమి తర్వాతే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగే అవకాశం ఉంది.

రెండో జాబితా కోసం..

కేసీ వేణుగోపాల్ నివాసంలో 2వ జాబితాపై జరిపిన కసరత్తులో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు థాక్రే, స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మురళీధరన్, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యులు – ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. సాయంత్రం గం. 4.00 నుంచి సుమారు రాత్రి గం. 10.00 వరకు ఈ భేటీ సుదీర్ఘంగా సాగింది. రాష్ట్రంలో మిగిలిన అన్ని నియోజకవర్గాలపై చర్చించి జాబితాను తయారు చేశామని, ఆ జాబితాను స్క్రీనింగ్ కమిటీ ఛైర్మన్ మరోసారి పరిశీలించి అవసరమైతే స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారని మాణిక్ రావు థాక్రే చెప్పారు.

ఆ తర్వాత జాబితాను కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేస్తామని, ఆ కమిటీ భేటీ అయ్యాక ఆమోదం తెలిపితే జాబితాను విడుదల చేయడానికి ఆస్కారం ఉంటుందని వెల్లడించారు. స్క్రీనింగ్ కమిటీలో సభ్యులుగా ఉన్న తెలంగాణ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మధుయాష్కితో పాటు జిగ్నేష్ మేవానీ, బాబా సిద్ధిఖి వంటి నేతలు లేకుండానే ఈ మీటింగ్ జరిగింది కాబట్టి.. ఒకవేళ ఆ నేతలు పట్టుబడితే మురళీధరన్ స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. లేదంటే దాన్ని బైపాస్ చేసి, కేసీ వేణుగోపాల్ నివాసంలో చేసిన కసరత్తు జాబితాను నేరుగా కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీకి అందజేస్తారు.

తొలి జాబితాలోనూ మార్పులకు అవకాశం?..

కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులను ఖరారు చేసేది సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) మాత్రమే. అంతకు ముందు ఎన్ని సమావేశాలు జరిగినా అవన్నీ అభ్యర్థుల వడపోత కోసం జరిగే కసరత్తే తప్ప ఎంపిక చేసే కసరత్తు కాదు. ఒకవేళ కాంగ్రెస్ సీఈసీ భేటీ జరపలేని పరిస్థితుల్లో అభ్యర్థుల ఎంపికపై నిర్ణయాధికారాన్ని అధిష్టానం ఇంకెవరికైనా అప్పగిస్తే తప్ప సీఈసీ భేటీ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయడం ఆనవాయితీగా కొనసాగుతూ వస్తోంది. అయితే శనివారం ఉదయం నుంచి కాంగ్రెస్ 2వ జాబితా విడుదల ఉంటుందంటూ విస్తృతంగా ప్రచారం జరిగింది. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగే సమావేశంలోనే తుది నిర్ణయం తీసుకుంటారని, ఆ తర్వాత జాబితా ప్రకటన ఉంటుందని కూడా కథనాలు వెలువడ్డాయి. కానీ ఈ సమావేశం ముగిసిన తర్వాత పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్‌రావ్ ఠాక్రే మాట్లాడుతూ.. సీఈసీ భేటీ తర్వాతనే అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు.

ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా..

ఇప్పటికే 55 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ తొలి జాబితా విడుదల చేసినప్పటికీ.. కేసీ వేణుగోపాల్ నివాసంలో జరిగిన భేటీలో మొత్తం 119 నియోజకవర్గాలపై చర్చ జరిగిందని ఆయన చెప్పారు. అంటే ఇప్పటికే ప్రకటించిన కొన్ని స్థానాల్లో ఏవైనా మార్పులుంటాయా అన్న సందేహాలకు ఆయన తావిచ్చారు. తొలి జాబితాపై పార్టీలో అంతర్గతంగా తీవ్ర అసంతృప్తి నెలకొనడాన్ని అధిష్టానం గ్రహించినట్టు కనిపిస్తోంది. ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా కేసులను సైతం ఎదుర్కొంటూ పార్టీకి విధేయంగా ఉంటూ కష్టపడ్డ నేతలను కాదని ఎగురుకుంటూ వచ్చిన పారాష్యూట్ నేతలకు టికెట్లు ఇస్తున్నారన్న ఆవేదన పార్టీ శ్రేణుల్లో బాగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రకటించిన సీట్లలోనూ ఒకట్రెండు చోట్ల మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు 2వ జాబితాయే తుది జాబితా అయ్యే అవకాశాలు కూడా కనిపించడం లేదు. సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వివాదం లేవు అనుకున్న స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి, వివాదం, పోటీ నెలకొన్న స్థానాలపై మరింత తాత్సారం చేసే అవకాశం ఉంది. అలాంటి స్థానాల్లో అభ్యర్థిని ఖరారు చేస్తే సీటు దక్కని బలమైన నేతలు బీజేపీలోకి చేజారిపోయే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అందుకే తదుపరి జాబితాపై ఆచితూచి అడుగులు వేస్తోంది. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ సమీపించే వరకు కొన్ని కొన్ని పేర్లతో జాబితాలను ప్రకటించుకుంటూ వెళ్లే అవకాశాలున్నాయి.

ఇంకా తేలని కమ్యూనిస్టులతో సీట్ల సర్ధుబాటు..

జాతీయస్థాయిలో ఏర్పడ్డ ప్రతిపక్షాల ఐక్యకూటమి I.N.D.I.A లో భాగస్వాములుగా ఉన్న ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెరో రెండు సీట్లు ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. నిజానికి సీపీఐ, సీపీఐ(ఎం) చెరో 5 సీట్లు డిమాండ్ చేసినప్పటికీ, చెరో రెండు సీట్లకు ఆ పార్టీలు అంగీకరించాయి. సంఖ్య విషయంలో ఎలాంటి వివాదం, విబేధాలు లేనప్పటికీ ఏయే స్థానాలను వారికి కేటాయించాలి అన్న విషయంపై మాత్రం చిక్కుముడి పడింది. సీపీఐకి చెన్నూరు, కొత్తగూడెం నియోజకవర్గాలు, సీపీఐ(ఎం)కు వైరా, మిర్యాలగూడా స్థానాలు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశించిన కాంగ్రెస్ నేతలతో పాటు పార్టీ శ్రేణులు సైతం నిరసనగళాన్ని వినిపిస్తున్నాయి. వైరాలో నేతలు ఏకంగా బహిరంగంగానే తమ నియోజకవర్గాన్ని సీపీఐ(ఎం)కు ఇవ్వొద్దని, అది కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే సీటు అని చెబుతూ ఆందోళన చేపట్టాయి. మిర్యాలగూడ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి నెలకొంది. పొత్తుల లెక్క తేలినా సీట్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ తదుపరి జాబితా జాప్యానికి ఇది కూడా ఒక కారణమని నేతలు చెబుతున్నారు.

34 సీట్లు ఇవ్వాల్సిందే..

తమకు సముచిత ప్రాధాన్యత ఉండాల్సిందేనంటూ బీసీ నేతలు ఓవైపు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మరోవైపు తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నాయి. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు కలిపి 50 శాతం సీట్లు కచ్చితంగా దక్కుతాయని నాయకత్వం భరోసా ఇస్తున్నప్పటికీ.. పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) తీర్మానం ప్రకారం బీసీలకు 34 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం కనీసం 50 శాతం సీట్లు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఓబీసీలకు ఉండాలి. ఆ లెక్కన తెలంగాణ అసెంబ్లీలోని మొత్తం 119 సీట్లలో సగం అంటే 59 లేదా 60 సీట్లు ఈ నాలుగు వర్గాలకు కలిపి ఇవ్వాలి. ఎస్సీ, ఎస్టీలకు ఎలాగూ రిజర్వుడు నియోజకవర్గాలున్నాయి. ఎస్సీలకు 18, ఎస్టీలకు 9 కలిపి మొత్తం 27 నియోజకవర్గాలను రిజర్వు చేయగా.. మిగతా రెండు వర్గాలు మైనారిటీలు, బీసీలకు కలిపి 33 సీట్లు దక్కాలి. మైనారిటీలకు ఇచ్చే స్థానాలను తీసేస్తే తమకు దక్కేవి ఎన్ని అన్న ప్రశ్న బీసీ నేతల నుంచి ఎదురవుతోంది. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ఈ అన్ని వర్గాలకు కలిపి 50 శాతం ‘మాత్రమే’ ఇవ్వాలని చెప్పలేదని, ‘కనీసం’ 50 శాతం ఈ వర్గాలకు దక్కేలా చూడాలన్నదే ఆ డిక్లరేషన్ సారాంశం అని చెబుతున్నారు. అంటే దానర్థం 50 శాతం మించకూడదు అని కాదని సూత్రీకరిస్తున్నారు. నాయకత్వం మాత్రం తమ ప్రత్యర్థి పార్టీ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కంటే ఎక్కువ సీట్లే బీసీలకు ఇస్తామని చెబుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి