AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: ఎన్నికల రణరంగంలో యువ నారీమణులు.. ఫైట్ మామూలుగా లేదుగా..!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆ జిల్లాలో రాజకీయ ఉద్దండులపై ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న ఇద్దరు నారీమణులు సమరానికి సిద్ధమయ్యారు. గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న ఆ మహిళ నేతలు జనంలో చర్చగా మారారు. ఇంతకీ ఎవరా నారీమణులు..?

Telangana Election: ఎన్నికల రణరంగంలో యువ నారీమణులు.. ఫైట్ మామూలుగా లేదుగా..!
Telanagana Elections
G Peddeesh Kumar
| Edited By: |

Updated on: Nov 10, 2023 | 11:41 AM

Share

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఆ జిల్లాలో రాజకీయ ఉద్దండులపై ఇప్పుడిప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకుంటున్న ఇద్దరు నారీమణులు సమరానికి సిద్ధమయ్యారు. గెలుపు ధీమాను వ్యక్తం చేస్తున్న ఆ మహిళ నేతలు జనంలో చర్చగా మారారు. ఇంతకీ ఎవరా నారీమణులు..? అంతటి రాజకీయ చరిత్ర కలిగిన ఉద్దండులు ఎవరు..? విషయం తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇద్దరు నారీమణులు హాట్ టాపిక్ అయ్యారు. వారిలో ఒకరు ములుగు నుండి పోటీ చేస్తున్న BRS అభ్యర్థి బడే నాగజ్యోతి కాగా, మరొకరు పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న హనుమాండ్ల యశస్విని రెడ్డి. వీరద్దరు కూడా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతుండటం విశేషం.

నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్రలో ఓటమి ఎరుగని నేత, ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రి ఒకసారి ఎంపీగా, వరుసగా గెలిచి వరంగల్ ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రంలోనే ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావుపై ఒకసారి పోటీచేసిన వారు రెండోసారి పోటీ చేసిన చరిత్ర లేదు. రెండోసారి ఆ ప్రత్యర్థులు వేరొక నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిందే..! లేదంటే పోటీ నుండి విరమణ పొందాల్సిందే..! అంతటి రాజకీయ చరిత్ర కలిగిన ప్రజ్ఞాశాలి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాలలో బాహుబలిగా ప్రత్యేక ముద్ర వేసుకున్న ఎర్రబెల్లిపై పోటీ చేయడమంటే సాహసమే. అలాంటి రాజకీయ ఉద్దండుడి పై 26 ఏళ్ల యువ నాయకురాలు పోటీకి సిద్ధపడింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా యశస్విని రెడ్డి బరిలోకి దిగుతోంది.

మొదట ఎన్నారై ఝాన్సీరెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పాలకుర్తి నుండి బరిలోకి దిగుతుందని భావించినప్పటికీ, భారతదేశ ప్రభుత్వం ఆమెకు పౌరసత్వం నిరాకరించింది. ఈ క్రమంలో ఆమె కోడలు యశస్విని రెడ్డిని బరిలోకి దింపారు. ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని ఆ యువ నాయకురాలిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పాలకుర్తి నుండి పోటీకి పెట్టింది. ఇంతటి రాజకీయ ఉద్దండుడిని ఎదురుకోవడం యశస్విని రెడ్డికి పెద్ద సవాల్‌గా మారింది. చిన్న వయస్సులో సాహసానికి పూనుకున్న యశస్విని రెడ్డి, చివరి వరకు నిలబడుతుందా లేదా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు వరంగల్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుండి మహిళా ఫైర్ బ్రాండ్‌గా ప్రత్యేక ముద్ర వేసుకున్న నేత సీతక్క అలియాస్ అనసూయ. ములుగు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సీతక్కపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా బడే నాగజ్యోతిని కేసీఆర్ బరిలోకి దింపారు. 29 ఏళ్ల వయసు కలిగిన నాగజ్యోతి తన జీవితంలో మొట్ట మొదటిసారి శాసనసభ ఎన్నికలకు పోటీ చేస్తుంది. ములుగు నియోజక వర్గంలో ప్రత్యేక ముద్ర వేసుకున్న సీతక్కపై నాగజ్యోతి పోటీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నాగజ్యోతి గెలుస్తుందా..? సీతక్క హ్యాట్రిక్ విక్టరీ సాధిస్తుందా..? అనే చర్చ కొనసాగుతుంది.

బడే నాగజ్యోతి వయసులో చిన్నదయినప్పటికీ కేసీఆర్ రాజకీయ వ్యూహంతోనే ఆమెను బరిలోకి దింపారు.. కాంగ్రెస్ అభ్యర్థి సీతక్కది BRS అభ్యర్థి నాగజ్యోతి ది దాదాపుగా ఒకే నేపథ్యం. ఓకే సామాజిక వర్గం. ఇద్దరిదీ ఉద్యమ చరిత్రే. సీతక్క ప్రత్యక్షంగా బందూకు పట్టి నక్సలైట్ ఉద్యమం నుండి జనజీవన స్రవంతిలోకి అడుగుపెట్టి ప్రజాప్రతినిధిగా ఎదిగారు. BRS అభ్యర్థి బడే నాగజ్యోతి తల్లిదండ్రులు ఇద్దరు అదే అజ్ఞాత జీవితంలో అసువులుబాశారు. ఈ నేపథ్యంలోనే తన తండ్రి పోరాట చరిత్రను ఎన్నికల అస్త్రంగా మలుచుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. 29 ఏళ్ల యువ నాయకురాలు సీతక్కను ఎదుర్కోగలుగుతుందా.? లేదా అనే చర్చ మొదలైంది. చూడాలి మరీ ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి పట్టం కడతారో..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…