AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: నేడు రాష్ట్రానికి మరోసారి ప్రధాని.. మాదిగ విశ్వరూప సభకు హాజరుకానున్న మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల వేళ వారం రోజులు తిరక్కుండానే ప్రధాని మోదీ రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇవాళ మాత్రం మాదిగ విశ్వరూప సభకు హాజరవుతున్నారు.

Telangana Election: నేడు రాష్ట్రానికి మరోసారి ప్రధాని.. మాదిగ విశ్వరూప సభకు హాజరుకానున్న మోదీ
Modi Manda Krishna Madiga
Balaraju Goud
|

Updated on: Nov 11, 2023 | 8:48 AM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఎన్నికల వేళ వారం రోజులు తిరక్కుండానే ప్రధాని మోదీ రెండోసారి హైదరాబాద్‌కు వస్తుండడంతో భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇవాళ మాత్రం మాదిగ విశ్వరూప సభకు హాజరవుతున్నారు.

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే మాదిగ, మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా ప్రధాన మంత్రి హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు ప్రధాని మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో నేరుగా పరేడ్ గ్రౌండ్‌కు వెళతారు. సాయంత్రం 5 గంటల నుంచి 5 గంటల 45 నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ లో జరిగే సభలో పాల్గొంటారు. సభ అనంతరం సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోదీ తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు. సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు.

ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించాలనే డిమాండ్‌తో ఏర్పడిన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాటం చేస్తోంది. 2000 సంవత్సరంలో ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లను వర్గీకరించినప్పటికీ 2004 లో కొన్ని సాంకేతిక కారణాల వల్ల సుప్రీంకోర్టు వాటిని రద్దు చేసింది. అప్పటి నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వర్గీకరణపై పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలను డిమాండ్‌ చేస్తోంది. అన్ని పార్టీలు వర్గీకరణ చేస్తామని హామీలు ఇస్తున్నప్పటికీ పార్లమెంట్‌లో బిల్లు మాత్రం పెట్టడం లేదు. ఎస్సీలోని మాల కులస్తులు దీనికి అభ్యంతరం చెబుతుండడం, ఇది దేశంలోని అన్ని ఎస్సీ కులాలకు వర్తించే అవకాశముండడంతో అధికార పార్టీలు దీని జోలికి వెళ్లడం లేదు. ఉద్యమ సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి రాగానే ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి కేంద్రానికి పంపించారు. అయినా ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం బిల్లు పెట్టలేదు.

తాము అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన బీజేపీ… పదేళ్లుగా అధికారంలో ఉన్నా ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదు. దీనిపై మాదిగ సామాజిక వర్గం తీవ్ర ఆగ్రహంతో ఉంది. దీంతో ఎన్నికల సమయంలో అత్యధిక ఓట్లు కలిగిన మాదిగ సామాజిక వర్గాన్ని మచ్చిక చేసుకునే పనిలో పడింది బీజేపీ. ఇప్పటికే టికెట్ల కేటాయింపులో ఆ సామాజిక వర్గానికి ప్రాధాన్యత నిచ్చింది. తెలంగాణలో 19 రిజర్వ్‌డ్ స్థానాలతో పాటు అదనంగా రెండు జనరల్ స్థానాల్లోనూ ఎస్సీలకు అవకాశం కల్పించింది. అందులో మాదిగ సామాజిక వర్గానికి 14 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాల సామాజిక వర్గానికి ఏడు అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. మాదిగ విశ్వరూప సభలో ఎస్సీ వర్గీకరణపై ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…