Telangana Election: ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం.. అఫిడవిట్ లేకుండా దాదాపు 100 మంది అభ్యర్థులు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నిన్న పొద్దుపోయేవరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో చోట వందకు పైగా నామినేషన్లు పడ్డాయి.

Telangana Election: ముగిసిన నామినేషన్ల స్వీకరణ ఘట్టం.. అఫిడవిట్ లేకుండా దాదాపు 100 మంది అభ్యర్థులు!
Election
Follow us
Balaraju Goud

|

Updated on: Nov 11, 2023 | 7:06 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం ముగిసింది. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నిన్న పొద్దుపోయేవరకు అధికారులు నామినేషన్లు స్వీకరించారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయిలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో చోట వందకు పైగా నామినేషన్లు పడ్డాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు భాగం. అయితే ఈసారి తెలంగాణ దంగల్‌లో కలహాలు, కన్నీటిస్వామ్యం హైలైట్‌గా నిలిచాయి. టికెట్లు మొదలు నామినేషన్ల అంకం ముగిసే వరకు అదే ట్రెండ్‌. ఇంతటితో పరిసమాప్తం కాదు.. మరెన్నో సిత్రాలు ఖాయం అన్నట్టుగా వుంది పొలిటికల్‌ ఫీవర్‌.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల మూడో తేదీ నుంచి మొదలైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగిసింది. 119 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహా మొత్తం 3,898 నామినేషన్లు దాఖలయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగిసినా గడువులోపు సంబంధిత రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయంలో నామినేషన్‌ వేసేందుకు లైన్‌లో ఉన్న అభ్యర్థులను అధికారులు అనుమంతించారు. చివరిరోజు కావడంతో ఆర్డీవో ఆఫీస్‌ల వద్ద అభ్యర్థుల కోలాహలం కనిపించింది. చివరి రోజు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్‌ వేశారు.

అధికార బీఆర్‌ఎస్‌ మొత్తం 119 నియోజకవర్గాల్లో పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 118 స్థానాల్లో అభ్యర్ధులను బరిలోకి దింపింది. మిగిలిన ఆ ఒక్క స్థానంలో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ పోటీ చేస్తోంది. కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్ వేశారు. ఇక బీజేపీ 111చోట్ల పోటీ చేస్తోంది. పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించిన 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సీపీఎం, ఎంఐఎం, బీఎస్పీ పార్టీల నుంచి సహా స్వతంత్రులు నామినేషన్లు వేశారు.

మరోవైపు, బి-ఫారం సమర్పణకు గడువు కూడా ముగిసింది. బి-ఫారం సమర్పించని అభ్యర్థులను ఎన్నికల సంఘం స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటిస్తుంది. నామినేషన్ ప్రక్రియలో వంద మందికి పైగా అభ్యర్థులు అఫిడవిట్‌లు సమర్పించలేదు. వీరికి రిటర్నింగ్ అధికారులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల నుంచి 2,644 నామినేషన్లు దాఖలయ్యాయి. తాజా గణాంకాల ప్రకారం ఈసారి నామినేషన్ల సంఖ్య ఎక్కువగానే ఉండవచ్చని స్పష్టమవుతోంది.

నవంబర్ 13వ తేదీన నామినేషన్ల పరిశీలనను ఎన్నికల అధికారులు చేపట్టనున్నారు. అలాగే నవంబర్ 15న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. అదేరోజు మూడు గంటల వరకు ఉపసంహరణ గడువు ముగుస్తుంది. అనంతరం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను అధికారులు ప్రకటించనున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 3.17 కోట్ల మంది ఓటర్లు నవంబర్ 30న తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…