Telangana Election: పెద్దపల్లిలో కొనసాగుతున్న ప్రధాన పార్టీల ప్రచార జోరు.. మెల్లగా పుంజుకుంటున్న బీఎస్పీ, బీజేపీ

| Edited By: Balaraju Goud

Nov 17, 2023 | 9:02 AM

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఇక్కడ చాప కింద నీరులా మెల్ల మెల్లగా బహుజన సమాజ్ వాదీ పార్టీ పుంజుకుంటుంది. మరోవైపు ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇక్కడ మాత్రం ప్రధానంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరా హోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

Telangana Election: పెద్దపల్లిలో కొనసాగుతున్న ప్రధాన పార్టీల ప్రచార జోరు..  మెల్లగా పుంజుకుంటున్న బీఎస్పీ, బీజేపీ
Brs, Congress ,bjp,bsp
Follow us on

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు నెలకొంది. ఇక్కడ చాప కింద నీరులా మెల్ల మెల్లగా బహుజన సమాజ్ వాదీ పార్టీ పుంజుకుంటుంది. మరోవైపు ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే, ఇక్కడ మాత్రం ప్రధానంగా రెండు పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్ హోరా హోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల మధ్యనే పోటీ కొనసాగింది. ఇప్పుడు మరోపారి తలపడుతున్నారు. ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ.. ఇక్కడ ప్రచారం మరింత వేడెక్కుతుంది. అధికార పార్టీ సంక్షేమ పథకాలను నమ్ముకుని ముందుకు వెళ్తుంటే, ప్రభుత్వ వైఫల్యాలను వివరించే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్. అయితే.. బీఎస్పీ, బీజేపీ చీల్చే ఓట్లు, ఎవరి కొంపముంచుతుందోనన్న గుబులు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను వెంటాడుతోంది.

పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మూడవ సారి పోటీ చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్ నుంచి విజయ రమణారావు, బీజేపీ నుంచి దుగ్యాల ప్రదీప్ రావు, బీఎస్పీ నుంచి దాసరి ఉష బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చారు విజయ రమణారావు. హ్యాట్రిక్‌పై కన్నేసిన మనోహర్ రెడ్డి

గత రెండు నెలులుగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బీఎస్పీ నుంచి ఖరగ్‌పూర్ ఐఐటీలో ఉన్నత విద్యను అభ్యసించిన దాసరి ఉష బరిలో ఉండటంతో హాట్ టాపిక్‌గా మారింది. ఈమె కూడా చాలా రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. పలువురు నేతలు కూడా బీఎస్పీలో చేరారు. అయితే.. బీజేపీ మాత్రం.. నామి నేషన్ చివరి రోజు అభ్యర్థిని ప్రకటించింది.. దీంతో ప్రచారంలో వెనుకంజలో ఉంది. ఇక్కడ ప్రతిపక్ష ఓట్ల చీలికపై కాంగ్రెస్ భయం పెట్టుకుంది. అయితే, ప్రభుత్వ వ్యతిరేకత తమకు అనుకూలంగా ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు..

సిట్టింగ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి.. హాట్రిక్ విజయం సాధిస్తామనే ధీమాతో ఉన్నారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. తన గెలుపు ఎవరూ ఆపలేరని అంటున్నారు. అయితే ఇటీవల బీఆర్ఎస్ నుంచి పలువురు నేతలు, కాంగ్రెస్ కండువా కప్పుకుంటున్నారు. దీంతో బీఆర్ఎస్‌కు కొంత మైనస్ గా మారిపోయింది. నేతలు వెళ్లినా, కేడర్ మొత్తం తమతోనే ఉన్నారని మనోహర్ రెడ్డి చెబుతున్నారు. మనోహర్ రెడ్డికి కాంగ్రెస్ గట్టి పోటీ ఇస్తుంది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే విజయ రమణరావు బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో 7 వేల ఓట్లకు పైగా తేడాతో ఓడిపోయారు. అప్పటి నుంచి నియోకవర్గంలోనే ఉంటూ పట్టు సాధించేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఇప్పటికీ, రెండు దశలో ప్రచారం పూర్తి చేస్తుకున్నారు. కాంగ్రెస్ చెందిన ఇద్దరు, ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్‌లో చేరారు. అయినప్పటికీ ఈసారి పెద్దపల్లిపై కాంగ్రెస్ జెండా ఎగురవేస్తానని విజయ రమణారావు అంటున్నారు.

బీఎస్పీ కూడా ఇక్కడ ప్రచారంలో దూసుకుపోతుంది. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టు ముట్టారు దాసరి ఉష. ఎస్సీ ఓట్లతో పాటు బీసీ ఓట్లు తనకు అనుకూలంగా ఉన్నాయనే ధీమాతో ఉన్నారు. అంతేకాకుండా.. వివిధ పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు బీఎస్పీలో చేరారు. బీజేపీ నుంచి దుగ్యాల ప్రదీప్ రావు బరిలో ఉన్నారు. ఈయనకు యువత ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ఈసారి ఓటర్లు గుణపాఠం చెబుతారని అంటున్నారు. మొత్తానికి, పెద్దపల్లిలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోరు ఉన్నప్పటికీ, బీఎస్పీ, బీజేపీ మాత్రం ఏదో అద్భుతం జరుగుతుందని ఆశతో ఉన్నాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…